రిలయన్స్‌ గర్జన.. మార్కెట్‌ బేర్‌!

14 Aug, 2019 02:15 IST|Sakshi

ప్రతికూలంగా దేశీ, అంతర్జాతీయ సంకేతాలు 

అర్జెంటీనా కరెన్సీ పెసో 15 శాతం, స్టాక్‌ మార్కెట్‌ 48 శాతం డౌన్‌  

ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు

హాంకాంగ్‌లో నిరసనల సెగ  

ఆరు నెలల కనిష్టానికి రూపాయి

ప్యాకేజీపై పెదవి విప్పని ప్రభుత్వం 

ఎఫ్‌పీఐల పన్నుపై మౌనం 37,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌ 

624 పాయింట్లు పతనమై 36,958 వద్ద ముగింపు  

184 పాయింట్లు నష్టపోయి 10,926కు నిఫ్టీ

రిలయన్స్‌ 10 శాతం జంప్‌

బలహీన అంతర్జాతీయ సంకేతాలకు దేశీయ ప్రతికూలతలు కూడా తోడవడంతో మన స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీగా పతనమైంది. అమెరికా–చైనాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, తాజాగా హాంకాంగ్‌లో చెలరేగుతున్న నిరసనలు, హింసాకాండ, అర్జెంటీనా కరెన్సీ పెసో భారీగా పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించాయి. మన దగ్గర వివిధ రంగాల్లో డిమాండ్‌ క్షీణిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆర్థిక గణాంకాలు, క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దారుణంగా దెబ్బతిన్నది. బక్రీద్‌ కారణంగా సోమవారం సెలవు కావడంతో ఒక రోజు విరామం తర్వాత మంగళవారం ఆరంభమైన స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,950 పాయింట్ల దిగువకు పడిపోయాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సంబంధించి సూపర్‌ రిచ్‌ పన్నుపై సర్‌చార్జీ, ఆర్థిక వ్యవస్థను మందగమనం బారి నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు ప్రకటించకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 624 పాయింట్లు పతనమై(1.66%) 36,958 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 184 పాయింట్లు క్షీణించి(1.65%) 10,926 పాయింట్ల వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ ఇంధన, ఆయిల్, గ్యాస్‌ సూచీలు మాత్రమే లాభాల్లో ముగియగా, మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.  

లాభాల్లోంచి నష్టాల్లోకి  
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో 173 పాయింట్లు పెరిగిన  సెన్సెక్స్‌ మరో దశలో 693 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 870 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 870 పాయింట్లు, నిఫ్టీ 244 పాయింట్లు పడింది.  
- ఈ ఏడాది జూలైలో వాహన విక్రయాలు 19 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయని సియామ్‌ వెల్లడించడంతో వాహన షేర్లు గతి తప్పాయి.  
యస్‌ బ్యాంక్‌ షేర్‌ 10.3 శాతం నష్టంతో రూ. 73.60 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. నేడు(బుధవారం) క్యూఐపీ ఇష్యూ ధరను ఖరారు చేయనుండటంతో ఈ షేర్‌ ఈ స్థాయిలో పతనమైంది.

రిలయన్స్‌ లాభపడకపోతే 1,000 పాయింట్ల నష్టం
అన్ని రంగాల షేర్లు, సెన్సెక్స్‌లోని 29 షేర్లు నష్టపోగా, రెండు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్డ్రీస్‌ 10 శాతం లాభపడి రూ. 1,275 వద్ద ముగిసింది. గత పదేళ్లలో ఈ షేర్‌ ఒక్క రోజులో ఇంతగా లాభపడటం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  సౌదీ ఆరామ్‌కో, బీపీలతో వాటా విక్రయ ఒప్పందాలతో రిలయన్స్‌కు రూ.1.15 లక్షల కోట్లు లభిస్తాయి. మరో వైపు  ఏడాదిన్నరలో రుణ రహిత కంపెనీగా నిలవడం లక్ష్యమని 42వ ఏజీఎమ్‌లో కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించడం రిలయన్స్‌ షేరును లాభాల బాట పట్టించాయి. షేరు జోరు తో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.71,638 కోట్లు పెరిగి, రూ.8,08,234 కోట్లకు చేరింది. ఈ షేర్‌ ఈ స్థాయిలో పెరగకపోతే సెన్సెక్స్‌ దాదాపు వెయ్యి పాయింట్ల మేర నష్టపోయి ఉండేది.

నష్టాలు ఎందుకంటే... 
- అర్జెంటీనా అల్లకల్లోలం...
అర్జెంటీనా ఎన్నికల్లో సంస్కరణలకు, మార్కెట్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకునే అధ్యక్షుడు మారిసియో మాక్రి దారుణంగా ఓడిపోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఎన్నికల ఫలితాల కారణంగా అర్జెంటీనా కరెన్సీ పెసో 15 శాతం పతనం కాగా, ఆ దేశ స్టాక్‌ మార్కెట్, ఎస్‌ అండ్‌ పీ మెర్వల్‌ సూచీ  48 శాతం(డాలర్ల పరంగా) నష్టపోయింది. (గత 69 ఏళ్లలో ఒక్కరోజులో ఒక స్టాక్‌ మార్కెట్‌  ఈ రేంజ్‌లో పతనం కావడం ఇదే మొదటిసారి) 

- ప్రపంచ మార్కెట్ల పతనం.... 
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత వేడెక్కడం, హాంగ్‌కాంగ్‌లో నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడం, అర్జెంటీనా, ఇటలీల్లో రాజకీయ అనిశ్చితి, సింగపూర్‌ తన పూర్తి ఏడాది వృద్ధి గణాంకాల్లో కోత విధించడం  వంటి కారణాలతో ఇన్వెస్టర్లు సురక్షిత మదుపు సాధనాలైన పుత్తడి, జపాన్‌ కరెన్సీ యెన్, బాండ్లవైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. హాంగ్‌సెంగ్‌ 2.1 శాతం, షాంఘై కాంపొజిట్‌ సూచీ 0.63 శాతం, కోస్పి 0.85 శాతం, నికాయ్‌ 1.1 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమయ్యాయి. ఆ తర్వాత కోలుకొని స్వల్ప లాభాల్లో ముగిశాయి.
 
- ఆర్థిక గణాంకాల నిరుత్సాహం: జూన్‌ నెలలో పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) నాలుగు నెలల కనిష్టానికి, 2 శాతానికి పడిపోయింది. శుక్రవారం వెలువడిన ఈ గణాంకాలు ఇన్వెస్టర్లలో నిరుత్సాహాన్ని నింపాయి. గత ఏడాది ఇదే నెలలో పారిశ్రామికోత్పత్తి 7 శాతంగా నమోదైంది.  

- పెదవి విప్పని ప్రభుత్వం: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు వర్తించే సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ సెస్‌పై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు వాహన, ఎన్‌బీఎఫ్‌సీ, ఆర్థిక రంగాలను ఆదుకోవడానికి ప్యాకేజీ సంబంధిత అంశాలపై ప్రభుత్వ వర్గాలు ఇప్పటివరకూ పెదవి విప్పలేదు.  

-ఆరు నెలల కనిష్టానికి రూపాయి:  డాలర్‌తో రూపాయి మారకం విలువ 62 పైసలు పతనమై 71.40 వద్దకు చేరింది. ఇది ఆరు నెలల కనిష్ట స్థాయి.  
ముడిచమురు ధరలు భగ్గు: ముడి చమురు ధరలు మంగళవారం నైమెక్స్‌లో 4 శాతం పైగా ఎగబాకాయి.

రూ. 2.21 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.21 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.2,21,838  కోట్లు ఆవిరై రూ. 1,39,46,997  కోట్లకు పడిపోయింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా