డి–మార్ట్‌.. లాభాల ధమాకా | Sakshi
Sakshi News home page

డి–మార్ట్‌.. లాభాల ధమాకా

Published Wed, Mar 22 2017 12:34 AM

డి–మార్ట్‌.. లాభాల ధమాకా

రెట్టింపు లాభంతో లిస్టింగ్‌
ఇష్యూ ధర రూ.299.. లిస్టింగ్‌ ధర రూ.604
ముగింపు ధర రూ.641; 114 శాతం లాభం


న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత వారంలో రికార్డ్‌ల మోత మోగించగా, ఈ వారం డి–మార్ట్‌  రిటైల్‌ స్టోర్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో చరిత్ర సృష్టించాయి. ఇష్యూ ధర(రూ.299)తో పోల్చితే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేర్లు బీఎస్‌ఈలో 102 శాతం లాభంతో రూ.604 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధరతో పోల్చితే వంద శాతం లేదా దాదాపు రెట్టింపు ధరకు లిస్టయిన షేర్లు ఇటీవల కాలంలో లేవు. ఈ బంపర్‌ లిస్టింగ్‌తో ఈ కంపెనీ ప్రమోటర్‌ రాధా కిషన్‌ దమానీ ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో ఎన్నో మెట్లు పైకి ఎక్కారు. వివరాలు..

ఇంట్రాడేలో రూ.650కు
ఇష్యూ ధర(రూ.299)తో పోల్చితే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేర్లు బీఎస్‌ఈలో 102 శాతం లాభంతో రూ.604 వద్ద లిస్టయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేర్‌ ధర 117 శాతం లాభంతో రూ.650కు దూసుకుపోయింది. చివరకు 114 శాతం లాభంతో రూ.641 వద్ద ముగిసింది. మంగళవారం మార్కెట్‌ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.39,998 కోట్లకు చేరింది. బీఎస్‌ఈలో 1.45 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో 8 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ కంపెనీ..ఈ నెల 8–10 మధ్య ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వచ్చింది. 104 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబయిన ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,870 కోట్లు సమీకరించింది.

వంద శాతం లిస్టింగ్‌ లాభాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద శాతం లాభాలతో లిస్టయిన తొలి కంపెనీ ఇదే. ఈ ఆర్థిక సంవత్సరంలో క్వెస్‌ కార్పొ 57 శాతం, థైరో కేర్‌ టెక్నాలజీస్‌  48 శాతం చొప్పున లిస్టింగ్‌ లాభాలను సాధించాయి. ఇక వంద శాతం లిస్టింగ్‌ లాభాలను ఇచ్చిన కంపెనీ ఇప్పటివరకూ ఒక్కటే ఉంది. రూ.8 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించిన మ్యాక్స్‌ అలెర్ట్‌ సిస్టమ్స్‌ కంపెనీ షేర్‌ వంద శాతం లిస్టింగ్‌ లాభాలను ఇచ్చింది. ఐపీఓ సైజ్‌ పరంగా చూస్తే ఈ రెండిటికి అసలు పోలికే పెట్టకూడదని నిపుణులంటున్నారు. రూ.2,984 కోట్లు సమీకరించిన పవర్‌గ్రిడ్‌ షేర్‌ 63 శాతం, రూ.1,771 కోట్లు సమీకరించిన ముంద్రా పోర్ట్‌ 75 శాతం వరకూ లిస్టింగ్‌ లాభాలను ఇచ్చాయి.

  ఇక మార్కెట్‌  క్యాపిటలైజేషన్‌ పరంగా చూస్తే. ఐదు నిఫ్టీ కంపెనీలు–ఏసీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడియా సెల్యులార్, టా టా మోటార్స్‌ డీవీఆర్‌ కన్నా ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఎక్కువ. అగ్రశ్రేణి వంద మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీల జాబితాలో అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ 65వ స్థానాన్ని సాధించింది. బ్రిటానియా ఇండస్ట్రీస్, పవర్‌ ఫైనాన్స్‌ కంపెనీ, మ్యారికో, ఇండిగో, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ల మార్కెట్‌ క్యాప్‌ను అధిగమించింది.

ఒక్క రోజులో 20వేల కోట్లు పెరిగిన దమానీ సంపద..
సోమవారమే ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కుబేరుల జాబితాను వెల్లడించింది. ఈ కుబేరుల జాబితాల్లో రాధాకిషన్‌ దమానీ భారత్‌లో 47వ స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా 896వ స్థానంలో ఉన్నారు. అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ బంపర్‌ లిస్టింగ్‌తో ఆయన సంపద అమాంతం పెరిగిపోయింది. ఆయన పెట్టుబడుల విభాగం బ్రైట్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, వివిధ ట్రస్టులు కలసి అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌లో 66 శాతం వాటా(41 కోట్ల షేర్లు) ఉంది. అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ బంపర్‌ లిస్టింగ్‌తో ఆయన సంపద ఒక్క రోజులోనే రూ.26,240 కోట్లు(390 కోట్ల డాలర్లు) పెరిగింది. ట్రస్ట్‌ల వాటా షేర్లు తీసేసినా, ఆయన సంపద రూ.20,480 కోట్లు(310 కోట్ల డాలర్లు) పెరిగినట్లు లెక్క. ఇక వివిధ లిస్టెడ్‌ కంపెనీల్లో ఆయనకున్న వాటాల విలువ రూ.3,000 కోట్ల పైబడే ఉంటుందని అంచనా. వీటన్నింటిని కలుపుకుంటే ఆయన మొత్తం సంపద 440 కోట్ల డాలర్లకు పెరుగుతుంది. దీంతో ఆయన ఆది గోద్రెజ్, పవన్‌ ముంజాల్, నుస్లీ వాడియా,  రాహుల్‌ బజాజ్, అజయ్‌ పిరమళ్‌ వంటి అతిరథ మహారథులను దాటేశారు.

ఈ ధరలో కొనొచ్చా?
దేశవ్యాప్తంగా ఈ కంపెనీ డి–మార్ట్‌ రిటైల్‌ స్టోర్స్‌ను 120 వరకూ నిర్వహిస్తోంది. నికరలాభం దాదాపు 50 శాతం  వృద్ధి సాధిస్తోంది. భారత్‌లో అత్యంత లాభదాయక సూపర్‌మార్కెట్‌ చెయిన్‌ ఇదే. ఉత్తమమైన రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ), ప్రమోటర్‌కు పటిష్టమైన నేపథ్యం, వ్యూహాత్మక ప్రదేశాల్లో స్టోర్ల ఏర్పాటు, వ్యయ నియంత్రణపై అధిక దృష్టి, పటిష్టమైన బ్రాండ్‌–ఈ సానుకూలాంశాలన్నీ ప్రస్తుత ధరలో ఫ్యాక్టర్‌ అయిపోయాయని ఏంజెల్‌బ్రోకింగ్‌కు చెందిన సీనియర్‌ ఈక్విటీ రీసెర్చ్‌ విశ్లేషకులు అమర్‌జీత్‌ మౌర్య పేర్కొన్నారు. అందుకని ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఇక ఐపీఓలో ఈ షేర్లు అలాట్‌ కాని ఇన్వెస్టర్లు ఈ షేర్‌ రూ.500–535 రేంజ్‌కి వచ్చినప్పుడు కొనుగోలు చేస్తే మంచిదని కొంతమంది నిపుణులు సలహా ఇస్తున్నారు.

Advertisement
Advertisement