ప్రతి ఆదివారం ఇక పెట్రోల్‌ బంకులు క్లోజ్ | Sakshi
Sakshi News home page

ప్రతి ఆదివారం ఇక పెట్రోల్‌ బంకులు క్లోజ్

Published Tue, Apr 11 2017 10:45 AM

ప్రతి ఆదివారం ఇక పెట్రోల్‌ బంకులు క్లోజ్ - Sakshi

ప్రతి ఆదివారం కేవలం ప్రభుత్వాఫీసులకు మాత్రమే సెలవు కాదు. ఇక పెట్రోల్, డీజిల్ బంకుల యాజమాన్యాలు సెలవును తీసుకోనున్నాయి. మే 14 నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లు మూసివేయనున్నామని పెట్రోలియం డీలర్స్ ప్రకటించారు. కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ లో భాగంగా  ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, హైయర్ డీలర్ కమిషన్ డిమాండ్ల నేపథ్యంలో కన్సోర్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2017 మే 14 నుంచి ప్రతి డీలర్ సెలవు తీసుకోవాలని సీఐపీడీ ఆదేశించినట్టు డీలర్స్ కన్సోర్టియం అధ్యక్షుడు ఏడీ సత్యనారాయణ్ చెప్పారు.
 
ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న 25వేల పెట్రోల్ బంకులపై పడనుందని తెలుస్తోంది. లీటరు డీజిల్ పై రూపాయి 65పైసలు, లీటరు పెట్రోల్ పై రెండు రూపాయల 56 పైసల కమిషన్ ను ప్రస్తుతం డీలర్లు పొందుతున్నారు. ఈ కమిషన్ ను మరింత పెంచాలని చాలాకాలంగా డీలర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు డీలర్స్ కమిషన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి నిరసనగా వారు ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూస్తామని ప్రకటించారు. అంతేకాక  మే 10ని 'నో పర్చేస్ డే' గా చేపట్టబోతున్నారు. 
 
ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడదని, సీఐపీడీ యాక్టివేట్ లో ఉండే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆదివారాలు పెట్రోల్, డీజిల్ బంకులు మూతపడతాయని తెలిపారు. అసోసియన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సపోర్టు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. తాము కూడా ప్రభుత్వం ఎక్కువ డీలర్ కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, కానీ మూత పెట్టడం లేదన్నారు.

Advertisement
Advertisement