3జీ స్మార్ట్ఫోన్లకు ఇక గుడ్బై.. | Sakshi
Sakshi News home page

3జీ స్మార్ట్ఫోన్లకు ఇక గుడ్బై..

Published Wed, Sep 28 2016 12:52 AM

3జీ స్మార్ట్ఫోన్లకు ఇక గుడ్బై..

తగ్గిన డిమాండే కారణం
అమ్మకాల్లో 4జీ మోడళ్లదే హవా 
విక్రయాలకు ఊతమిస్తున్న జియో

హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో : భారత్‌లో 3జీ స్మార్ట్‌ఫోన్లకు కాలం చెల్లనుందా? మొబైల్ తయారీ కంపెనీలు వీటికి బై బై చెప్పనున్నాయా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. మొబైల్ కంపెనీలన్నీ దాదాపు కొత్తగా విడుదల చేస్తున్న అన్ని స్మార్ట్‌ఫోన్లనూ 4జీలో తీసుకు వస్తున్నాయి. 90 రోజులపాటు ఉచిత సర్వీసులతో జియో ఇస్తున్న వెల్‌కమ్ ఆఫర్‌తో 4జీ హ్యాండ్‌సెట్లకు విపరీత డిమాండ్ ఏర్పడింది. దీంతో 3జీ హ్యాండ్‌సెట్లకు డిమాండ్ లేకుండా పోయింది. అటు విక్రేతలు సైతం 4జీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంకేముంది కొన్ని కంపెనీలు 3జీ మొబైల్స్ తయారీకి గుడ్‌బై చెప్పేశాయి. మరికొన్ని వీటిని అనుసరించడం ఖాయంగా కనపడుతోంది. అటు డేటా చార్జీలు గణనీయంగా పడిపోవడంతో కస్టమర్లు 4జీకి సై అంటున్నారు.

అనతి కాలంలోనే..
ప్రభుత్వ రంగ ఎంటీఎన్‌ఎల్ 2008 డిసెంబరులో 3జీ సేవలను ప్రారంభించింది. ప్రైవేటు రంగంలో ఎయిర్‌టెల్ 2011 జనవరిలో ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మిగిలిన టెల్కోలు 3జీ సేవలను ప్రారంభించాయి. ఈ ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా 3జీ సేవలు ఇంకా విస్తరించకముందే అప్పుడే 4జీ వేగం పుంజుకుంది. రిలయన్స్ జియో ఇందుకు ఆజ్యం పోసింది. 4జీ మొబైళ్ల ధర 3జీ స్థాయికి వచ్చి చేరింది. రూ.3 వేల నుంచి ఇవి లభిస్తున్నాయి. ఈ స్థాయిలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు జియో వెల్‌కమ్ ఆఫర్ కస్టమర్లను ఊరిస్తోంది.

3జీ హ్యాండ్‌సెట్లు ఉన్నవారు సైతం మరో స్మార్ట్‌ఫోన్‌ను 4జీలో తీసుకుంటున్నారు. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో 4జీ వాటా 80 శాతానికి ఎగిసింది. ఆరు నెలల క్రితం ఇది 40 శాతమేనని కంపెనీ కేటగిరీ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ నూర్ పటేల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. తమ స్టోర్లలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 90 శాతం 4జీ మోడళ్లేనని బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి చెప్పారు. 4జీ నెట్‌వర్క్ లేని ప్రాంతాలకు చెందిన కస్టమర్లు మాత్రమే 3జీ మోడళ్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే 3జీలో కొత్త ఫోన్లు రావడం లేదని లాట్ మొబైల్స్ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ల విషయంలో 3జీ మోడళ్లకు కాలం చెల్లినట్టేనని వర్తకులు అంటున్నారు.

 దిగొస్తున్న ధరలు..: రిలయన్స్ జియో లైఫ్ బ్రాండ్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్లను రూ.2,999ల నుంచే విక్రయిస్తోంది. దీంతో మార్కె ట్ ఒక్కసారిగా షేక్ అయింది. మిగిలిన కంపెనీలూ అందుబాటు ధరలో ఫోన్లను తీసుకురాక తప్పలేదు. దిగ్గజ కంపెనీ అయిన శామ్‌సంగ్ ఇటీవలే రూ. 4,699లకే జడ్2 మోడల్‌ను విడుదల చేసింది. లెనోవో, ప్యానాసోనిక్, జడ్‌టీఈ, ఇంటెక్స్, లావా, కార్బన్, ఇన్‌ఫోకస్, జోలో, ఐబాల్ తదితర కంపెనీలు రూ.5 వేలలోపు ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్ నేపథ్యంలో మొబైల్ రిటైల్ చైన్ సంస్థ బిగ్ సి సైతం రూ. 2,999లకే ఎక్స్‌క్లూజివ్‌గా 4జీ హ్యాండ్‌సెట్‌ను తీసుకొస్తోంది. లాట్ మొబైల్స్ సైతం ఇదే బాటలో ఉంది.

ఇక నుంచి 4జీ మాత్రమే..
కొత్తగా ఫోన్లు కొనేవారు 4జీ మోడళ్లనే ఎంచుకుంటున్నారని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. అటు 3జీ కస్టమర్లు సైతం 4జీకి మళ్లుతున్నారని ప్యానాసోనిక్ మొబిలిటీ బిజినెస్ హెడ్ పంకజ్ రానా అన్నారు. ప్రస్తుతం నెలకొన్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో కేవలం 4జీ మోడళ్లనే విడుదల చేయాలని తయారీ కంపెనీలు నిర్ణయించాయి. శామ్‌సంగ్ ఖాతా లో ప్రస్తుతం 25 మోడళ్లున్నాయి. ఇందులో 3 మాత్రమే 3జీ ఫోన్లు. మిగిలినవన్నీ 4జీయే. కొన్ని నెలలుగా శామ్‌సంగ్ కొత్తగా విడుదల చేస్తున్న ఫోన్లన్నీ పూర్తిగా 4జీ మోడల్లే ఉంటున్నాయి. లెనోవో-మోటరోల, వన్ ప్లస్, వివో సైతం శామ్‌సంగ్‌ను అనుసరిస్తున్నాయి. 3జీ విభాగం నుంచి వైదొలగనున్నట్టు ఒప్పో, హెచ్‌టీసీ ప్రకటించాయి కూడా.

Advertisement

తప్పక చదవండి

Advertisement