కొత్త ప్రీమియంలో 40 శాతం వృద్ధి లక్ష్యం | Sakshi
Sakshi News home page

కొత్త ప్రీమియంలో 40 శాతం వృద్ధి లక్ష్యం

Published Tue, Dec 5 2017 12:22 AM

40% growth in new premium target - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొత్త ప్రీమియం వసూళ్లలో దాదాపు 40 శాతం వృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ అరిజిత్‌ బసు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం వ్యక్తిగత పాలసీల ప్రీమియం వసూళ్లు సుమారు రూ. 7,100 కోట్లు కాగా.. ఈ సారి రూ. 9,800 కోట్ల దాకా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక, స్థూలంగా మొత్తం ప్రీమియం వసూళ్లు దాదాపు రూ. 21,000 కోట్లు ఉండగా.. ఈసారి రూ. 25,000 కోట్ల మేర అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు.

వ్యక్తిగత పాలసీల కొత్త ప్రీమియం వసూళ్లు ఈ ఏడాది ఇప్పటిదాకా 46 శాతం వృద్ధితో దాదాపు రూ. 4,700 కోట్లుగా ఉన్నాయని, మిగతా నాలుగు నెలల్లో మరింత మెరుగుపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ ఎస్‌బీఐ లైఫ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వివరించారు. హైదరాబాద్‌ రీజియన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ దేబాసిస్‌ చటర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్‌ రీజియన్‌లో కొత్త పాలసీల ప్రీమియం వసూళ్లు సెప్టెంబర్‌ ఆఖరు నాటికి రూ. 145 కోట్ల నుంచి రూ. 205 కోట్లకు పెరిగినట్లు బసు చెప్పారు.

70 శాతం డిజిటల్‌..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమకు 96,000 మంది ఏజెంట్లు ఉండగా.. హైదరాబాద్‌ రీజియన్‌లో 4,978 మంది ఉన్నారని బసు పేర్కొన్నారు. సంస్థ వ్యాపారంలో బ్యాంకెష్యూరెన్స్‌ చానల్‌ వాటా 65 శాతంగాను, ఏజెన్సీ చానల్‌ది 32 శాతంగాను ఉంటోందని ఆయన వివరించారు. కొత్తగా మరో రెండు బ్యాంకులు.. తమ బ్యాంకెష్యూరెన్స్‌ చానల్‌కి తోడవుతున్నట్లు చెప్పారు. మరోవైపు, వచ్చే నెలలో ’పూర్ణ సురక్ష’ పేరిట నాలుగు రకాల క్రిటికల్‌ ఇల్‌నెస్‌ సమస్యలకు సమగ్రమైన కవరేజీ ఇచ్చే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బసు తెలిపారు.

తమ వ్యాపారంలో దాదాపు 60–70 శాతం డిజిటల్‌ మాధ్యమంలో.. ట్యాబ్‌లు, మొబైల్స్‌ ద్వారానే ఉంటోందని పేర్కొన్నారు. పూర్తి ఆన్‌లైన్‌ విధానానికి సంబంధించి మూడు పాలసీలు అందిస్తున్నామని.. ఏటా సుమారు 20,000 పాలసీలను విక్రయిస్తున్నామన్నారు. దేశీయంగా ఉన్న దాదాపు 23 బీమా సంస్థల్లో చాలామటుకు కంపెనీలు మెరుగైన లాభాలు సాధిస్తూనే ఉన్న నేపథ్యంలో కన్సాలిడేషన్‌ అవకాశాలు తక్కువే ఉండొచ్చని బసు చెప్పారు. 

Advertisement
Advertisement