మార్చికల్లా 40 హెలికాప్టర్ క్యాబిన్లు సరఫరా | Sakshi
Sakshi News home page

మార్చికల్లా 40 హెలికాప్టర్ క్యాబిన్లు సరఫరా

Published Fri, Aug 22 2014 12:59 AM

40 helicopter cabins supply within march

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ యూనిట్ నుంచి ఎస్92 హెలికాప్టర్‌కు చెందిన 40 క్యాబిన్లను సరఫరా చేయనున్నట్టు సికోర్‌స్కీ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఎస్92కు డిమాండ్ పెరుగుతోందని కంపెనీ సైట్ మేనేజర్ హేమంత్ రాణే సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇంజనీరింగ్ రంగంలో పరిశోధన, అభివృద్ధి అన్న అంశంపై నాస్కామ్ గురువారమిక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

డిమాండ్‌నుబట్టి ఆదిభట్ల యూనిట్లో క్యాబిన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు. క్యాబిన్ తయారీకి అవసరమైన అన్ని విడిభాగాలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తయారు చేస్తోందని వివరించారు. హెలికాప్టర్ల తయారీలో ఉన్న అమెరికాకు చెందిన సికోర్‌స్కీ, టాటా గ్రూప్ కంపెనీ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంయుక్తంగా హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్ల వద్ద ప్లాంటు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 రక్షణలో ప్రైవేటు..: రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 26 నుంచి 49 శాతానికి చేర్చడంతో దేశీయంగా తయారీ రంగానికి బూస్ట్‌నిస్తుందని హేమంత్ రానే అన్నారు. ‘రక్షణ పరికరాల తయారీలో సింహభాగం ప్రభుత్వ సంస్థల చేతుల్లోనే ఉండేది. ప్రభుత్వ విధానాలు సైతం ప్రైవేటును ప్రోత్సహించేలా లేవు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్‌లో అత్యుత్తమ ఫలితాలు రానున్నాయి. ప్రైవేటు పాత్ర పెరుగుతుంది’ అని అన్నారు. కొన్ని విడిభాగాలను ఒకే పరికరంగా తయారు చేసే విధానాన్ని కంపెనీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. సమయం ఆదా అవుతుందని, రాబడి పెరుగుతుందని చెప్పారు. డిఫెన్స్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్  వ్యాపార పరిమాణం భారత్‌లో 15 శాతం వృద్ధితో రూ.96,000 కోట్లుందని జిన్నోవ్ సీనియర్ డెరైక్టర్ సిద్ధాంత్ రస్తోగీ తెలిపారు.

 మానవ రహిత వాహకాలు..
 ప్రపంచ వ్యాప్తంగా మానవ రహిత వాహకాల అభివృద్ధికి చేస్తున్న వ్యయం రూ.48,000 కోట్లుంది. వచ్చే 10 ఏళ్లలో రూ.4.8 లక్షల కోట్లకు చేరుకోనుందని టాటా హెచ్‌ఏఎల్ టెక్నాలజీస్ సీఈవో రాజరాజన్ షణ్ముగం తెలిపారు.  వాహకాల వినియోగం రక్షణతోపాటు వాణిజ్యం, అత్యవసర సేవలకూ విస్తరిస్తోందని పేర్కొన్నారు. విదేశీ కంపెనీల సహకారంతో, అలాగే దేశీయంగానూ వీటిని తయారు చేయాలని భారత్ చూస్తోందని వివరించారు. సింగపూర్, దుబాయి మాదిరిగా విమానాల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు భారత్‌కు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement