బీమా పరిశ్రమ డిమాండ్... | Sakshi
Sakshi News home page

బీమా పరిశ్రమ డిమాండ్...

Published Sat, Jun 28 2014 12:35 AM

బీమా పరిశ్రమ డిమాండ్... - Sakshi

 49 శాతానికి ఎఫ్‌డీఐ ‘పరిమితి’
 
దేశంలో ఇంకా సుప్తావస్తలోనే ఉన్న బీమా రంగం మరింత వేళ్లూనుకోవాలంటే... ప్రభుత్వం నుంచి తగిన సహాయసహకారాలు కావాలని పరిశ్రమ కోరుతోంది. ముఖ్యంగా మోడీ నేతృత్వంలోని కొత్తసర్కారు తమ రంగానికి తొలి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అంటోంది.
 ఎఫ్‌డీఐల పరిమితి పెంపే కీలకం...

ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచాలని బీమా కంపెనీలు ఎప్పటినుంచో ముక్తకంఠంతో చెబుతున్నాయి. దీనివల్ల నిధుల లభ్యత పెరిగి వ్యాపార విస్తరణకు దోహదం చేస్తుందని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బీమా రంగంలో 26 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. దీన్ని 49 శాతానికి పెంచాలనేది పరిశ్రమ డిమాండ్. గత యూపీఏ ప్రభుత్వం దీనికి 2013 జూలైలో ఆమోదం తెలిపింది.  అయితే, పార్లమెంట్ ఆమోదానికి లోబడి మాత్రమే ఈ పరిమితి పెంపు ఉంటుందని పేర్కొంది.

ఇతర ముఖ్య విజ్ఞప్తులు ఇవీ...

1.    బ్యాంకులను అన్నిరకాల ఇన్సూరెన్స్ కంపెనీల బీమా పాలసీలను విక్రయించేందుకు వీలుగా బ్రోకర్‌గా అనుమతించాలి. ప్రస్తుతం కార్పొరేట్ ఏజెంట్‌గా మాత్రమే బ్యాంకులకు అనుమతి ఉంది. అదీకూడా లైఫ్, నాన్-లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌లకు చెందిన ఒక్కో కంపెనీకి మాత్రమే ఏజెంట్‌గా వ్యవహరించాలనేది నిబంధన.
2.    ఆరోగ్య బీమా పథకాలవైపు ప్రజలను ఆకర్షితులను చేయాలంటే ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపుల పరిమితిని పెంచాలి. ప్రస్తుతం సెక్షన్ 80డీ ప్రకారం రూ.15,000 వరకూ ఆరోగ్యబీమా పాలసీకి పన్ను ఆదాయం నుంచి మినహాయింపు అమల్లో ఉంది. దీన్ని రూ.50 వేలకు పెంచాలని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కోరుతున్నాయి.
3.   మరింత మందికి ఆరోగ్యబీమా పథకాలవైపు మొగ్గుచూపేలా చేయడానికి పన్ను మినహాయింపు పరిమితి పెంపు తప్పనిసరి.
4.    వైపరీత్యాలను కవర్ చేసే విధంగా అందిస్తున్న పాలసీలపట్ల ప్రజలను ఆకర్షితులు చేయాలంటే ఇలాంటి పాలసీలపై వ్యయానికికూడా పన్ను మినహాయింపులు ఇవ్వాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement