రూపాయి దాటనంటున్న క్యాండీలు! | Sakshi
Sakshi News home page

రూపాయి దాటనంటున్న క్యాండీలు!

Published Fri, Nov 27 2015 1:13 AM

రూపాయి దాటనంటున్న క్యాండీలు!

 86% మార్కెట్ 50 పైసలవే
 విలువ చేకూరిస్తేనే అధిక ధరలో అమ్మకం
 కాంట్రాక్ట్ తయారీకి కన్ఫెక్షనరీ కంపెనీల మొగ్గు

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
 ఏంటీ! ఇది రూపాయా? రూపాయికి రెండొచ్చేవి ఇవ్వండి. ప్రతి కిరాణా షాపులో చాకొలేట్ల కోసం వచ్చే పిల్లలు, వారితో వచ్చే తల్లిదండ్రులతో సహజంగా రోజూ జరిగే చర్చ ఇది. క్యాండీ, ఇక్లెయిర్ సైజు ఎంత ఉందో పిల్లలకు అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా రూపాయికి రెండు. ఈ అంశమే కన్ఫెక్షనరీ కంపెనీలకు మింగుడు పడడం లేదు. ధర 50 పైసల నుంచి రూపాయికి పెంచుదామంటే బడా కంపెనీల ధాటికి తట్టుకునే పరిస్థితి లేదు. ఇదంతా ఒక ఎత్తై ఇప్పుడు యువత కొత్త రుచులను కోరుకుంటున్నారు. అందుకే కంపెనీలు ఒక అడుగు ముందుకేసి క్రీమ్, పౌడర్ నింపిన క్యాండీలు, ఇక్లెయిర్స్ వంటి విలువ చేకూర్చిన వెరైటీలను ప్రవేశపెడుతున్నాయి. మార్కెట్లో నిలదొక్కుకోవాలన్నా, ధర పెంచి విక్రయించాలన్నా ఉత్పత్తులు ప్రత్యేకత చూపాల్సిందేనని కంపెనీలు అంటున్నాయి. కన్ఫెక్షనరీ రంగంలో దేశంలో పార్లే, ఐటీసీ, పర్ఫెట్టి, క్యాడ్‌బరీ, నెస్లే కంపెనీలదే హవా.
 
 రూపాయివి 14 శాతం మాత్రమే..
 దేశంలో హార్డ్ బాయిల్డ్ క్యాండీల విపణి పరిమాణం 9 శాతం వార్షిక వృద్ధితో రూ.1,800 కోట్లుంది. ఇందులో రూపాయి క్యాండీల వాటా 14 శాతం మాత్రమే. 86 శాతం మార్కెట్ 50 పైసల క్యాండీలదేనంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చక్కెర మినహా మిగిలిన ముడి పదార్థాల ధర పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ధర పెంచలేక క్యాండీల సైజు తగ్గించాల్సి వస్తోందని కంపెనీలు అంటున్నాయి. సైజుతో, రుచితో సంబంధం లేదు. ఎక్కువ వస్తాయి కాబట్టే కస్టమర్లు 50 పైసలవి కొంటున్నారని రవి ఫుడ్స్ చైర్మన్ రమేశ్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కన్ఫెక్షనరీ రంగంలో విపరీత పోటీ ఉంది. డబ్బున్న కంపెనీలే ప్రకటనల ద్వారా ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకుంటున్నాయి. పోటీలో నిలదొక్కుకోలేక చాలా కంపెనీలు ప్లాంట్లను మూసివేసుకుంటున్నాయి. చిన్నా, పెద్దా కంపెనీలు ఇప్పుడు కాంట్రాక్ట్ తయారీకి మొగ్గుచూపుతున్నాయి’ అని వివరించారు. చాకొలేట్ల విషయానికి వస్తే బహుమతులకు విదేశీవైతే బాగుంటుందన్న అభిప్రాయం పెరుగుతోందని చెప్పారు.
 
 అమ్మాలంటే విలువ చేకూర్చాల్సిందే..
 20 ఏళ్లుగా చాలా కంపెనీల క్యాండీలు, ఇక్లెయిర్స్ ధర రూపాయిని మించడం లేదని డీఎస్ గ్రూప్ న్యూ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ శశాంక్ సురానా తెలిపారు. రూ.2కు విక్రయించిన కొన్ని కంపెనీలు చేతులు కాల్చుకుని తిరిగి రూపాయికే పరిమితమయ్యాయని, ఇంత ఖరీదైన వెరైటీలకు మార్కెట్ రెడీగా లేదని చెప్పారు. క్యాండీలు, ఇక్లెయిర్స్‌ను రూపాయి, ఆపై ధరల విక్రయించాలంటే ప్రత్యేక రుచి, ప్యాక్, ఆకారంలో తయారు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకే పాస్‌పాస్ పల్స్ పేరుతో పౌడర్ నింపిన క్యాండీలను ప్రవేశపెట్టామన్నారు. రూపాయి క్యాండీలు, ఇక్లెయిర్స్ విభాగంలో క్యాడ్‌బరీ, నెస్లే, డీఎస్ గ్రూప్ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని రమేశ్ అగర్వాల్ తెలిపారు. పోటీ ఇవ్వాలంటే రుచిలో భిన్నత్వం చూపాల్సిందేనన్నారు.
 
 ఇదీ కన్ఫెక్షనరీ మార్కెట్..
  భారత కన్ఫెక్షనరీ మార్కెట్ రూ.14,925 కోట్లుందని ఏసీ నీల్సన్ సర్వే చెబుతోంది.
  ఇందులో చాకొలేట్లు 56%తో రూ.8,400 కోట్లు, నాన్ గమ్-నో చాకొలేట్స్(ఎన్‌జీఎన్‌సీ) 32%తో రూ.4,800 కోట్లు, గమ్స్ రూ.1,725 కోట్లు కైవసం చేసుకున్నాయి.

 ఎన్‌జీఎన్‌సీలో హార్డ్ బాయిల్డ్ క్యాండీల (హెచ్‌బీసీ) మార్కెట్ అత్యధికంగా 38 శాతం వాటాతో రూ.1,800 కోట్లుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇక్లెయిర్స్ రూ.1,600 కోట్లు, జెల్లీ, లాలీపాప్స్, కాఫ్ లోజెంజెస్ వంటి ఇతర ఉత్పత్తుల విభాగం మార్కెట్ పరిమాణం రూ.1,400 కోట్లుగా ఉంది.
  హార్డ్ బాయిల్డ్ క్యాండీల వినియోగంలో ముంబై, హైదరాబాద్‌లు టాప్-2 నగరాలు. పచ్చి మామిడికాయ రుచిలో ఉండే క్యాండీలే ఎక్కువ అమ్ముడవుతున్నాయి.

  హైదరాబాద్‌కు చెందిన రవి ఫుడ్స్ పలు బ్రాండ్ల కన్ఫెక్షనరీ ఉత్పత్తులను థర్డ్ పార్టీగా తయారు చేస్తోంది. అలాగే సొంతంగానూ విక్రయిస్తోంది. కంపెనీ దేశీయంగా రూ.50 కోట్లు, ఎగుమతులు ద్వారా మరో రూ.50 కోట్ల వ్యాపారం చేస్తోంది.

  భాగ్యనగరికి చెందిన సాంప్రె సైతం పలు బ్రాండ్లకు థర్డ్ పార్టీగా ఉంటూ సొంతంగానూ  ఉత్పత్తులను అమ్ముతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement