యస్‌ బ్యాంకులో భారీగా ఉద్యోగాల కోత | Sakshi
Sakshi News home page

యస్‌ బ్యాంకులో భారీగా ఉద్యోగాల కోత

Published Thu, Sep 21 2017 8:50 AM

యస్‌ బ్యాంకులో భారీగా ఉద్యోగాల కోత

సాక్షి, న్యూఢిల్లీ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తర్వాత మరో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంకు కూడా భారీగా ఉద్యోగాల కోత చేపట్టింది. తన వర్క్‌ఫోర్స్‌లో 10 శాతానికి పైగా ఉద్యోగులను బ్యాంకు తొలగించింది. అంటే 2,500 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. పేలవమైన పనితీరు, డిజిటలైజేషన్‌ ప్రభావం ఎక్కువ అవుతుండటంతో బ్యాంకు ఈ ఉద్యోగాల కోతను చేపట్టింది. ఈ ఉద్యోగాల కోతను బ్యాంకు ఇంకా కొనసాగించవచ్చని కూడా తెలిసింది. బలమైన కార్మిక స్థాయిని కలిగిన ఉన్న యస్‌ బ్యాంకు, ఇలా ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా దేశంలో అత్యంత విలువైన కంపెనీగా పేరులోకి వచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా మూడు త్రైమాసికాల్లో 11వేల మంది ఉద్యోగాలను ఇంటికి పంపించేసింది. 
 
సాధారణంగా చేపట్టే మానవ మూలధన నిర్వహణ పద్ధతులలో భాగంగా, ఎక్కువ ఉత్పాదకతను, మెరుగైన సామర్థ్యాన్ని సాధించడానికి పనితీరుతో లింక్‌ అయ్యే చర్యలను చేపడుతుందని యస్‌ బ్యాంకు చెప్పింది. తమ సాధారణ అప్రైజల్‌ సైకిల్‌లో ప్రతేడాది తక్కువ పనితీరు కనబర్చే ఉద్యోగులను గుర్తిస్తామని పేర్కొంది. ఇతర దిగ్గజ ప్రైవేట్‌ రంగ బ్యాంకుల మాదిరిగానే తాము ఈ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపింది. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్‌ పరిశ్రమ వార్షిక అట్రిక్షన్‌ రేటు 16-22 శాతం మధ్యలో ఉంది.

రెడండెన్సీని తగ్గించుకోవడానికి బ్యాంకులు ఉద్యోగులను తొలగిస్తున్నాయని బ్యాంకు ఇన్‌సైడర్స్‌ చెప్పారు. ఇదే సమయంలో టాప్‌ క్యాంపస్‌ల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించుకుంటున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు డిజిటల్‌లోకి మారే ప్రక్రియ కొనసాగుతుందని, మంచి ఉత్పాదకత, వ్యయ సామర్థ్యం, కస్టమర్‌ సర్వీసు లక్ష్యంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని యస్‌ బ్యాంకు ప్రకటించింది. జూన్‌ ముగింపు వరకు యస్‌ బ్యాంకులో 20,851 మంది  ఉద్యోగులున్నారు.

Advertisement
Advertisement