Sakshi News home page

ఎయిర్‌టెల్‌ పెమెంట్స్‌ బ్యాంక్‌ సేవలు

Published Thu, Dec 15 2016 1:46 AM

ఎయిర్‌టెల్‌ పెమెంట్స్‌ బ్యాంక్‌ సేవలు

జనవరి నాటికి దేశమంతా
5 లక్షల బ్యాంకింగ్‌ పాయింట్లు
తెలుగు రాష్ట్రాల్లో సర్వీసులు ప్రారంభం  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ జనవరికల్లా దేశవ్యాప్తంగా సేవలను విస్తరించనుంది. ఇటీవలే రాజస్తాన్లో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించిన ఎయిర్‌టెల్‌... రెండు వారాల్లోనే 1,00,000 ఖాతాలను సాధించింది. బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సేవలు మొదలుపెట్టింది. ఢిల్లీ వేదికగా వచ్చే నెలలో దేశవ్యాప్తంగా అధికారికంగా సేవలను ఆరంభించనుంది. డిజిటల్‌ రూపంలో నగదు స్వీకరించేలా 30 లక్షల మంది వర్తకులను సిద్ధం చేస్తామని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో శశి అరోరా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల కస్టమర్లకే ప్రాధాన్యమిస్తామన్నారు. భారత్‌లో ఎయిర్‌టెల్‌కు 25 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు, 15 లక్షల రిటైల్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి. పేమెంటు బ్యాంకు విస్తరణకు ఇవి దోహదం చేస్తాయని ఆయన వెల్లడించారు.
కస్టమర్లకు రుణాలు..

దేశవ్యాప్తంగా పేమెంట్స్‌ బ్యాంక్‌ విస్తరించిన తర్వాత ఇతర సేవలను అందిస్తామని శశి అరోరా వెల్లడించారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీతో చేతులు కలిపి ఖాతాదారులకు రుణాలు ఇప్పిస్తామన్నారు. ‘‘భారత్‌లో 23.3 కోట్ల మందికి బ్యాంకు ఖాతాల్లేవు. వీరందరినీ చేరుకోవాలన్నదే మా లక్ష్యం. ఆధార్‌ ఆధారంగా రెండు నిముషాల్లోనే ఉచితంగా ఖాతా తెరుస్తాం. కనీస బ్యాలెన్స్‌ అవసరం లేదు. కస్టమర్‌ మొబైల్‌ నంబరే ఖాతా సంఖ్య. తొలిసారి డిపాజిట్‌ చేసిన మొత్తానికి సమానంగా టాక్‌టైం ఇస్తున్నాం. డిపాజిట్లపై 7.25 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తాం. కస్టమర్లు ఎలాంటి డిజిటల్‌ చెల్లింపులైనా చేయొచ్చు. వీటికి ప్రాసెసింగ్‌ ఫీజు లేదు. వేరే బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేస్తే 0.5% చార్జీ ఉంటుంది. నగదు విత్‌డ్రాకు రూ.4 వేలలోపు రూ.25 వరకు, రూ.4 వేలపైన 0.65% చార్జీ చేస్తాం. బేసిక్‌ ఫోన్‌తోనూ బ్యాం కు ఖాతాను తెరవొచ్చు’ అని తెలిపారు. ఖాతాదారుకు రూ. లక్ష ఉచిత ప్రమాద బీమా ఉంది.

బ్యాంకింగ్‌ పాయింట్లుగా..: రీచార్జ్‌ ఔట్‌లెట్లుగా ఇప్పటిదాకా కస్టమర్లకు చేరువైన రిటైల్‌ కేంద్రాలు ఎయిర్‌టెల్‌ బ్యాంకింగ్‌ పాయింట్లుగా మారతాయి. వీటిలో ఖాతా తెరవడం, నగదు జమ, స్వీకరణ సేవలను కస్టమర్లు పొందవచ్చు. దేశవ్యాప్తంగా 5 లక్షల బ్యాంకింగ్‌ పాయింట్లు ఏర్పాటయ్యాయి. భాగస్వాముల పనితీరు ఆధారంగా రీచార్జ్‌ కేంద్రాలను బ్యాంకింగ్‌ పాయింట్లుగా తీర్చిదిద్దుతున్నట్టు ఏపీ, తెలంగాణ సర్కిల్‌ సీఈవో వెంకటేష్‌ విజయ్‌ రాఘవన్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం 20,000 కేంద్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దశలవారీగా మరిన్ని కేంద్రాలకు విస్తరిస్తామన్నారు.

Advertisement
Advertisement