ట్రాయ్కు.. కాల్ ట్రాఫిక్ డేటా | Sakshi
Sakshi News home page

ట్రాయ్కు.. కాల్ ట్రాఫిక్ డేటా

Published Tue, Sep 20 2016 12:39 AM

ట్రాయ్కు.. కాల్ ట్రాఫిక్ డేటా

అందజేసిన ఎయిర్‌టెల్, వొడాఫోన్, జియో
న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లు తమ నెట్‌వర్క్ పరిధిలో కాల్ ట్రాఫిక్ వివరాలను సమర్పించాయి. ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్ మినిట్స్ వివరాలు ఇందులో ఉన్నాయి. ఇంటర్ కనెక్షన్ వినియోగ చార్జీ (ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు వెళ్లే కాల్స్‌పై చెల్లించే చార్జీ) అంశంపై సంప్రదింపుల్లో భాగంగా ట్రాయ్ ఈ వివరాలు కోరింది. వీటి ఆధారంగా అసాధారణ ట్రాఫిక్ తీరును పరిశీలించనుంది. అయితే ఆపరేటర్లు సమర్పించిన ఈ వివరాలు జూలై నెలకు సంబంధించినవని ట్రాయ్ వర్గాలు తెలిపాయి. ఇన్‌కమింగ్ కాల్స్, అవుట్‌గోయింగ్ కాల్స్ ట్రాఫిక్ ఒకే స్థాయిలో ఉండాలి. కానీ, కొందరు ఆపరేటర్లు ఇది అసాధారణ స్థాయి (ఒకవైపు ఎక్కువ)లో ఉన్నట్టు ట్రాయ్ దృష్టికి తీసుకొచ్చాయి.

 రెండు నెలలు గడువు పొడిగించండి: సీఓఏఐ
ఇంటర్ కనెక్షన్ యూసేజీ చార్జీ(ఐయూసీ)కి సంబంధించి ట్రాయ్ విడుదల చేసిన సంప్రదింపుల పత్రాలపై తమ అభిప్రాయాలు తెలిపేందుకు రెండు నెలలకు పైగా గడువు పొడిగించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఓఏఐ) ట్రాయ్‌ను కోరింది. ఆపరేటర్లు రానున్న స్పెక్ట్రమ్ వేలం వ్యవహారంపై దృష్టి సారించినందున, వేలం గడువు ముగిసిన దగ్గర్నుంచి రెండు నెలల పాటు అదనపు గడువు ఇవ్వాలని కోరినట్టు సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. దీనిపై ట్రాయ్‌కు లేఖ రాశామన్నారు. జియో మార్కెట్ ప్రవేశం చేయడంతో, తమ అభిప్రాయాలు తెలిపేముందు పూర్తి స్థాయి విశ్లేషణ చేయాల్సి ఉంటుందన్నారు. ఐయూసీపై అభిప్రాయాలకు ట్రాయ్ ఈ నెల 19వరకు గడువు ఇచ్చింది.

 సేవల నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: ట్రాయ్
సేవల నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని టెల్కోలను ట్రాయ్ హెచ్చరించింది. నెట్‌వర్క్ పరిధిలో రద్దీపై వివరాలు ఇవ్వాలని కోరింది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకుంటున్న కస్టమర్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ దరఖాస్తులను తిరస్కరిస్తున్నాయంటూ ప్రత్యర్థులపై రిలయన్స్ జియో చేసిన ఫిర్యాదుపైనా ట్రాయ్ స్పందించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని టెల్కోలను కోరింది.

ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ  మాట్లాడుతూ... ఈ నెల 15 -19 తేదీల మధ్య ఆపరేటర్లు ఎన్ని కాల్స్‌ను స్వీకరించింది, ఎన్ని కాల్స్ ఫెయిల్ అయ్యిందీ వివరాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. తమ నెట్‌వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు సరిపడా ఇంటర్‌కనెక్ట్ పాయింట్లు కల్పించకపోవడంతో కాల్స్ ఫెయిల్ అవుతున్నాయంటూ జియో ఆరోపించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement