Sakshi News home page

అమెరికా చికెన్ లెగ్స్‌కు భయపడం!

Published Thu, Jun 25 2015 12:25 AM

అమెరికా చికెన్ లెగ్స్‌కు భయపడం!

అవసరమైతే అక్కడికే చికెన్ బ్రెస్ట్ ఎగుమతి చేస్తాం...

♦ డిసెంబర్‌కల్లా మార్కెట్లోకి స్నేహా ఫాస్ట్ ఫుడ్స్
♦ జడ్చర్లలో రూ.100 కోట్లతో చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్
♦ మార్కెట్లోకి సఫల వంట నూనె, గోధుమ పిండి
♦ స్నేహా గ్రూప్ సీఎండీ రాంరెడ్డి
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘‘చేపలు, రొయ్యలు వంటి సముద్ర జీవులు, ఇతర మాంసాహారాలతో పోల్చుకుంటే కోడి ధర తక్కువ. పెపైచ్చు దీన్లో కొవ్వు పదార్థాలు కూడా తక్కువ. అందుకే మన దేశంలో కోళ్ల వ్యాపారానికి డిమాండ్ బాగుంటుంది. దీన్ని ఆసరా చేసుకొని అమెరికా మన దేశానికి కోడి కాళ్లను ఎగుమతి చేస్తోంది. నిజానికిది తప్పేమీ కాదు. కాకపోతే మొత్తం కోడిని ఎగుమతి చేయాల్సింది పోయి.. అమెరికన్స్ తినకుండా వదిలేసిన కోడి కాళ్లను మాత్రమే చైనా, ఇండియా వంటి దేశాలకు ఎగుమతి చేయడం సరైంది కాదు’’ అని స్నేహా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.రాంరెడ్డి చెప్పారు.

అయినా మన దేశంలో 95 శాతం వ్యాపారం లైవ్ కోళ్ల మీదే సాగుతుందని, మిగిలిన 5 శాతం మార్కెట్లోనే అమెరికన్ చికెన్ లెగ్స్ పోటీ పడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘‘అలాంటప్పుడు మాలాంటి కంపెనీలకు అమెరికన్ చికెన్ లెగ్స్ ఏమీ చేయలేవు. వీలును బట్టి అమెరికాకు స్నేహా చికెన్ బ్రెస్ట్‌ను ఎగుమతి చేస్తాం. ఇందుకోసం అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నాం’’ అని తెలియజేశారు. బుధవారమిక్కడ సఫల బ్రాండ్ పేరుతో వంట నూనె, గోధుమ పిండి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్నేహా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గోపాల్ రెడ్డి, డెరైక్టర్లు స్నేహ, వరుణ్ రెడ్డిలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..

► మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో చిన్న కిరాయి షాపులో రూ.40 వేల బ్యాంక్ రుణంతో  రాం రెడ్డి చికెన్ సెంటర్ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాం. అప్పట్లో రోజుకు 4 కోళ్లు విక్రయించేవాణ్ణి. అదే నేడు స్నేహా గ్రూప్‌గా మారి రోజుకు 2.50 లక్షల కోళ్లను (5 లక్షల కిలోల చికెన్) విక్రయించే స్థాయికి చేరాం. చికెన్, చికెన్ ఫీడ్, ఫిష్ ఫీడ్ ల నుంచి తాజాగా ఎఫ్‌ఎంసీజీ విభాగంలోకి అడుగుపెట్టాం.
► గతేడాది రూ.1,850 కోట్ల టర్నోవర్‌ను చే రుకున్నాం. ఈ ఏడాది రెండింతల వృద్ధి రేటును ఆశిస్తున్నాం. స్నేహా గ్రూప్ ఎదుగుదలకు ముఖ్య కారణం కోళ్ల పెంపకంలో ఆరోగ్యకరమైన నిబంధనలు పాటించటం, కోళ్లకు ప్రొటీ న్స్ ఉన్న ఫుడ్‌ను అందించటం వంటివే.
► {పస్తుతం ఏపీ, కరీంనగర్, హైదరాబాద్‌లో కోడి, చేపల ఫీడ్ ప్లాంట్లున్నాయి. వీటి నుంచి రోజుకు 3,800 మెట్రిక్ టన్నుల ఫీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. దేశంలో ఫీడ్ మార్కెట్ ఏటా 10-12 శాతం వృద్ధి చెందుతుంటే.. స్నేహా గ్రూప్ మాత్రం ఏటా 30-40 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోంది. స్నేహా గ్రూప్ ఉత్పత్తి చేస్తున్న ఫీడ్‌లో 70 శాతం కంపెనీ వినియోగించుకుంటుంటే.. మిగతాది విక్రయిస్తున్నాం. ఇలా నెలకు 16 వేల మెట్రిక్ టన్నుల ఫీడ్‌ను విక్రయిస్తున్నాం.
► {పస్తుతం ఎఫ్‌ఎంసీజీ విభాగంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ఇందులో రూ. 220 కోట్లు పెట్టుబడులు పెట్టాం. ఎఫ్‌ఎంసీజీ విభాగంలో ప్రతి ఆరు నెలలకోసారి ఓ కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేస్తాం. రెండు నెలల్లో మిర్చి పౌడర్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం స్నేహా గ్రూప్‌లో 3 వేల మంది ఉద్యోగులున్నారు.
► తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం ద్వారా అనుమతులందుకున్న తొలి 15 కంపెనీల్లో స్నేహా గ్రూప్ ఒకటి. రూ.110 కోట్ల పెట్టుబడులతో జడ్చర్లలోని అడ్డకల్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నాం. దీన్ని నాలుగు నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఈ ఏడాది ముగింపు కల్లా ఈ ప్లాంట్ నుంచి స్నేహా ఫాస్ట్ ఫుడ్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తాం.
► ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కర్ణాటలోని గంగావతిల్లో ఫీడ్ ప్లాంట్లను నిర్మిస్తున్నాం. వీటిని వచ్చే ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తాం. ఒక్కో ప్లాంట్‌పై రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టాం. వీటి సామర్థ్యం రోజుకు 800 మెట్రిక్ టన్నులు. కానీ, ప్రస్తుతానికైతే 400 మెట్రిక్ టన్నుల ఫీడ్ మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement