పాలసీ, ఫలితాలే దిక్సూచి.. | Sakshi
Sakshi News home page

పాలసీ, ఫలితాలే దిక్సూచి..

Published Mon, Aug 3 2015 12:24 AM

పాలసీ, ఫలితాలే దిక్సూచి..

♦ వడ్డీ రేట్లు తగ్గితే, పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల ర్యాలీ
♦ ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనా
 
 న్యూఢిల్లీ : మంగళవారం రిజర్వుబ్యాంకు వెల్లడించ బోయే పరపతి విధానం, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల క్యూ1 ఫలితాల ఆధారంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. అలాగే రుతుపవనాల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు సైతం మార్కెట్‌ను నిర్దేశిస్తాయని వారన్నారు.

 తొలుత ఈ సోమవారం ఆటోమొబైల్ కంపెనీల జూలై విక్రయాలకు అనుగుణంగా ఆయా షేర్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని నిపుణులు తెలిపారు. అటు తర్వాత ఆగస్టు 4నాటి ఆర్‌బీఐ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్ల దృష్టి మళ్లుతుందని వారు పేర్కొన్నారు. ఆర్‌బీఐ పాలసీతో పాటు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణలు కూడా సమీప భవిష్యత్తులో మార్కెట్‌ను శాసిస్తాయని క్యాపిటల్ వయా గ్లోబల్ డైరె క్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఆర్‌బీఐ తన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గిస్తే పీఎస్‌యూ బ్యాంకులు పెద్ద ర్యాలీ జరుపుతాయని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోది అంచనావేశారు.

రేట్ల కోత లేకపోయినా మార్కెట్ పెద్దగా ప్రతికూలంగా స్పందించబోదని, రేట్ల తగ్గింపు వుండకపోవొచ్చన్న అంశాన్ని ఇప్పటికే ఇన్వెస్టర్లు డిస్కౌంట్ చేసుకున్నారని జైఫిన్ అడ్వయిజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నాగ్వి అన్నారు. ఆర్‌బీఐ గవర్నర్ ఆర్థిక వ్యవస్థపై వెలిబుచ్చే అంచనాలను మార్కెట్ నిశితంగా గమనిస్తుందని, తదుపరి రేట్ల కోత అవకాశాలపై అంచనాల్ని ఏర్పర్చుకుంటుందని ఆయన వివరించారు.

 ఈ వారం ఫలితాలు...
 ఈ వారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్ కార్ప్, భారతి ఎయిర్‌టెల్, బీహెచ్‌ఈఎల్, మహీం ద్రా, టాటా మోటార్స్ కంపెనీలు ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో మెరుగుదల ఏమీ లేదని, ఆర్థిక వ్యవస్థ బలహీనత ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నదని అశికా స్టాక్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ పారస్ బోత్రా అన్నారు.

 గతవారం మార్కెట్
 గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 2.25 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 28,115 పాయింట్ల వద్ద ముగిసింది. పీఎస్‌యూ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ర్యాలీ జరపగా, కమోడిటీ షేర్లు క్షీణించాయి.

 విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 5,300 కోట్లు
 జూలై నెలలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ స్టాక్ మార్కెట్లో రూ. 5,300 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈక్విటీ మార్కెట్లో రూ. 5,319 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 4 కోట్లు నికరంగా కొనుగోళ్లు జరపడంతో జూలై నెలలో మొత్తం క్యాపిటల్ మార్కెట్లో వారి పెట్టుబడుల విలువ రూ. 5,323 కోట్లకు చే రినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది.

Advertisement

తప్పక చదవండి

Advertisement