ఆనంద్! ఇక ‘సిప్’ చేయండి! | Sakshi
Sakshi News home page

ఆనంద్! ఇక ‘సిప్’ చేయండి!

Published Mon, Sep 21 2015 2:36 AM

Anand raju's investment

ఆనంద్ రాజుకు 27 ఏళ్లు. వివాహమయింది. నెలకు కోతలన్నీ పోను చేతికి రూ. 28 వేల వరకూ వస్తుంది. దాన్లో 18 వేలు ఖర్చయిపోతాయి. మిగిలిన 10 వేలూ పొదుపు చేస్తుంటాడు. కాకపోతే ఆనంద్‌కు పొదుపు పథకాలపై, పెట్టుబడులపై ఎలాంటి అవగాహనా లేదు. దీంతో మిగిలే సొమ్మంతా తన సేవింగ్స్ ఖాతాలోనే జమ చేస్తున్నాడు. ఇలా జమ చేసిన మొత్తం ఇప్పటికి రూ. 3 లక్షలపైనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పథకాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది? ఎందుకంటే తనకు ఇప్పటిదాకా ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్లూ లేవు. కానీ ఆర్థికంగా ఆయనకు కొన్ని లక్ష్యాలున్నాయి. అవేంటంటే... 35 ఏళ్లు నిండేసరికల్లా కనీసం రూ. 50 లక్షలు పెట్టి సొంత ఇల్లు కొనుక్కోవాలి. 60 ఏళ్లకు రిటైరయి... హాయిగా బతకాలి. ఈ ప్రశ్నను ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగోకు పంపించాం. మరి ఆయన ఏమన్నారు? ఏం సూచించారు. ఇదే ఈ వారం ‘ప్లానింగ్’...
 
లక్ష్యాలు బాగున్నాయి..

ఆనంద్! నేను గమనించిందేమంటే మీ లక్ష్యాలు, వాటి ప్రాధాన్యాలు చాలా బాగున్నాయి. కాకపోతే వీటిని సాధించడానికి మీరు సరిపోయే నిధిని సమకూర్చుకోవాలి. అందుకోసం ప్రస్తుతం మీ దగ్గరున్న మిగులు మొత్తాన్ని సరైన రీతిలో పెట్టుబడులకు మళ్లించాలి. మీ వయసు చిన్నదే కాబట్టి... ఇపుడు మీరు కాస్త రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. మీ లక్ష్యాలకోసం మీరు సమకూర్చుకోవాల్సిందేంటంటే...
 
- ఇల్లు కొనుగోలు చేయటం. దానికి 2023 నాటికి రూ.50 లక్షలు కావాలి.
- రిటైరయ్యే నాటికి... అంటే 2048 నాటికి నెలకు రూ.18,000 రావాలి.

 
కాకపోతే ఇంటికి కావాల్సిన సొమ్మును గానీ, రిటైర్మెంట్ అనంతరం అవసరమయ్యే మొత్తాన్ని గానీ ఇప్పటి రేట్ల ప్రకారం లెక్కించాం. కానీ ధరలు ఇప్పట్లా ఉండవు కదా? అందుకని ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలా తీసుకుంటే మీ రిటైర్మెంట్ నిధి ఈ కింది విధంగా ఉండాలి. ఇక ఇంటి విషయానికొస్తే డౌన్ పేమెంట్‌గా కనీసం 20 శాతం మొత్తం ఉండాలి. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి.
 
ఇలా విశ్లేషించొచ్చు...
దాచుకున్న మొత్తాన్ని డెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు
అక్కడి నుంచి క్రమంగా ఈక్విటీలోకి మళ్లించండి 
అప్పుడే సొంతింటిసహా హ్యాపీ రిటైర్మెంట్

కాల వ్యవధిని బట్టి మీ అవసరాలను మధ్య కాలిక, దీర్ఘకాలిక అవసరాలుగా విభజించవచ్చు. మధ్య కాలిక అవసరాలు తీర్చుకోవటానికి ఈక్విటీ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్ వంటి  విభిన్న సాధనాలను ఎంచుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక లక్ష్యాలకోసమైతే ఎక్కువగా ఈక్విటీపైనే ఆధార పడాలి. సొంతిల్లు విషయానికొస్తే మీరు గృహ రుణం తీసుకోవచ్చు. కావాల్సిన మొత్తం రుణం 40 లక్షలు. ఇది మీరు కొనాలనుకుంటున్న మొత్తంలో 80 శాతం. దీనికి నెలవారీ ఈఎంఐల రూపంలో రూ. 41వేలు చెల్లించాల్సి ఉంటుంది. రుణ వ్యవధి 20 ఏళ్లు. ఇలాగైతే మీరు సంపాదిస్తున్న మొత్తంపై ఈఎంఐ ప్రభావం చాలానే ఉంటుంది. అది మీ ఇతర అవసరాలపై కూడా పడుతుంది. ఇక డౌన్‌పేమెంట్‌గా మీరు చెల్లించాల్సిన మొత్తం కోసం... మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.

 
నా సూచనలు ఇవీ..
మీ అవసరాలు కావచ్చు... లక్ష్యాలు కావచ్చు. వాటిని సాధించాలంటే ఇప్పటి నుంచే మీరు మీ నెలవారీ పొదుపు మొత్తాన్ని పెట్టుబడులలోకి మళ్లించండి. ఎవరైనా నెలవారీ పొదుపు మొత్తాన్ని పెట్టుబడుల్లోకి మళ్లించాలంటే దానికో చక్కని మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్). దీన్లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయటం వల్ల ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. దీర్ఘకాలంలో మార్కెట్లు పెరుగుతాయన్న అంచనాలుంటాయి కనక సగటు కొనుగోలు మొత్తం తగ్గుతుంది. దీనివల్ల భారీ నిధిని సమకూర్చుకోవటం వీలవుతుంది. ఇక మీ సేవింగ్స్ ఖాతాలో ఇప్పటిదాకా దాచుకున్న మొత్తం విషయానికొస్తే దాన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి... సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా కొన్నాళ్ల వ్యవధిలో ఈక్విటీలోకి మళ్లించండి. వీటితో పాటు మీరు ఆరోగ్య బీమాను తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే ఆ ఖర్చులు తట్టుకోవటం చాలా కష్టం. మీ వయసు, రిస్క్ సామర్థ్యం, మీకు వస్తున్న ఆదాయాన్ని బట్టి మీరు ఈ కింది పోర్ట్‌ఫోలియోను పరిశీలించవచ్చు.



అప్పటికి ఖర్చులు ఇలా ఉండవచ్చు..!


ప్రస్తుతం నెలకు మీకు అవుతున్న ఖర్చు రూ.18 వేలు. కాకపోతే ద్రవ్యోల్బణాన్ని, ఇతరత్రా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే మరో 33 ఏళ్ల తరవాత మీకు నెలకు అవసరమయ్యే మొత్తం రూ.1.23 లక్షలు. దాన్ని చూస్తే..


ప్రస్తుతం నెలకు ఖర్చు    రూ.18 వేలు
ద్రవ్యోల్బణం అంచనా        6 శాతం
రిటైర్మెంట్ సంవత్సరం      2048
అప్పటి నెలవారీ ఖర్చు    రూ.1,23,131
 
అనిల్ రెగో
సీఈవో, రైట్స్‌హొరైజన్స్

Advertisement
Advertisement