మొండి బకాయిలు బాబోయ్.. | Sakshi
Sakshi News home page

మొండి బకాయిలు బాబోయ్..

Published Fri, Jan 23 2015 1:26 AM

మొండి బకాయిలు బాబోయ్.. - Sakshi

ఆంధ్రా బ్యాంకు ఉద్యోగుల్లో ఆందోళన
టాప్ ఎగవేతదార్ల ఇళ్లు, ఆఫీసుల ఎదుట ప్రదర్శన
జాబితాలో టీడీపీ ఎంపీ గుండు సుధారాణి భర్త
వరంగల్‌లో ఆయన పెట్రోల్ బంకు ఎదుట నిరసన
ఇప్పటికే రూ. 6,800 కోట్లు దాటిన ఆంధ్రా బ్యాంకు మొండిబకాయిల విలువ...

 
సాక్షి, హైదరాబాద్, విజయవాడ బ్యూరో: నిరర్ధక ఆస్తులు... ముద్దుగా ఎన్‌పీఏలు. అంటే బ్యాంకులు ఆశలు వదిలేసుకున్న బకాయిలు. ఈ బకాయిలు అంతకంతకూ పెరుగుతూ చివరికి బ్యాంకింగ్ వ్యవస్థనే కబళించే కేన్సర్ మాదిరి తయారయ్యాయి. ఎగవేతదార్లలో ఎక్కువ మంది రాజకీయంగా, ఇతరత్రా పలుకుబడి ఉన్నవారు కావటంతో బ్యాంకులు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి.

అందుకే 2013 డిసెంబర్ నాటికి దేశంలోని బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిత్రమేంటంటే దేశంలో 40 వరకూ స్టాక్‌మార్కెట్లో లిస్టయిన బ్యాంకులుండగా మొత్తం ఎన్‌పీఏల్లో 70 శాతం 10 బ్యాంకులవే. రూ.2.4 ల క్షల కోట్ల నిరర్ధక ఆస్తుల్లో 28 శాతంతో 69 వేల కోట్లతో ఎస్‌బీఐ ప్రథమ స్థానంలో ఉండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
 
ఆంధ్రా బ్యాంకు మనుగడకే సవాలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రధానంగా వ్యాపారం నిర్వహిస్తున్న ఆంధ్రాబ్యాంకుకు ఈ ఎన్‌పీఏల బెడద మరీ ఎక్కువగా ఉంది. ఈ బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు దాదాపు 6,884 కోట్లకు చేరుకున్నాయి. మిగతా బ్యాంకులతో పోలిస్తే ఆంధ్రాబ్యాంకు చిన్నది. వ్యాపారం తక్కువ. అలాంటిది ఈ బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు ఈ స్థాయిలో ఉండటం ఉద్యోగులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

ఎన్‌పీఏలు పెరిగిపోతున్న దృష్ట్యా ఈ బ్యాంకును మరో పేరున్న బ్యాంకులో విలీనం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుండటంతో వీరి ఆందోళన మరింత పెరుగుతోంది. దీంతో మొండి బకాయిల వసూళ్ల కోసం వారే స్వయంగా ఉద్యమించటం మొదలెట్టారు. గురువారం నాడు వినూత్న తరహాలో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని మౌన ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు.

ఆంధ్ర, తెలంగాణల్లోని 16 జోన్లతో పాటు దేశవ్యాప్తంగా 33 జోన్లలో ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తోంది. దాదాపు అన్ని జోన్లలోనూ మొదటి మూడు స్థానాల్లో ఉన్న మొండి బకాయిదారుల ఇళ్లు, కార్యాలయాల ముందు శాంతియుతంగా ప్రదర్శనలు చేశారు. బకాయిలు తిరిగి చెల్లించాలని ఎగవేతదారుల్ని కోరారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనే సుమారు 2200 కోట్లకు పైగా వసూలు కావాల్సిన మొండి బకాయిలున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.
 
ఎగవేతదారుల్లో రాజకీయ నాయకులు...
భారీగా రుణాలు తీసుకుని యూనిట్లు పెట్టని వారు, పెట్టిన యూనిట్లను నష్టాలంటూ మధ్యలో మూసేసిన వారు, లాభాలున్నా రుణాల చెల్లింపుపై ఆసక్తి చూపని వారు కోస్తా జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నారు. బాకీలు వసూలు కాకుంటే బ్యాంకు ఉనికికే ప్రమాదమని భావించిన బ్యాంకు అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారు.

మొండిబకాయిల జాబితాలను చెల్లించాల్సిన మొత్తం ఆధారంగా తయారుచేసి ఎగవేతదార్ల ఇళ్లు, వ్యాపార సంస్థల ముందు ఒకోరోజు ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ఆంధ్రాబ్యాంకు అవార్డు ఎంపాయీస్ యూనియన్ అంగీకరించింది. దీంతో గురువారం విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి, వరంగల్ జిల్లాల్లో ఉద్యోగులు బకాయిదారుల ఇళ్ల  ముందు మౌన ప్రదర్శనలు జరిపారు.

విజయవాడ జోన్ పరిధిలోనే రూ.200 కోట్ల బకాయిలున్నాయనీ, గురువారం వీనస్ ఆక్వా ఫుడ్స్, హిమజ ఫర్టిలైజర్స్, సోమనాథ్ ఇండస్ట్రీస్‌ల ఎదుట ఆందోళన నిర్వహించామని డీజీఎం కృష్ణారావు చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి భర్త గుండు ప్రభాకర్ కూడా మొండి బకాయిదార్లలో ఉండటంతో ఆయనకు చెందిన పెట్రోల్ బంకు ఎదుట ఉద్యోగులు ప్రదర్శన జరిపారు.
 
జోన్ పరిధిలో ఉన్న మొండి బకాయిలకు సంబంధించి మొదటి స్థానంలో ఉన్న ముగ్గురిని ఎంచుకుని వాళ్ల కార్యాలయాల ముందు, నివాసాల ముందు ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించాం. ఈ హఠాత్ పరిణామంతో బకాయిదారులూ ఆశ్చర్యానికి గురయ్యారు.
 - జి.రవికుమార్, హైదరాబాద్ జోనల్ మేనేజర్

Advertisement

తప్పక చదవండి

Advertisement