ఏపీజీవీబీ లాభం రూ.503 కోట్లు | Sakshi
Sakshi News home page

ఏపీజీవీబీ లాభం రూ.503 కోట్లు

Published Wed, May 16 2018 12:58 AM

APGVB profit is Rs 503 crores - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ) 2017–18 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసింది. దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నిట్లో (ఆర్‌ఆర్‌బీ) అత్యధికంగా రూ.503 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 42.9 శాతం అధికం. నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) గణనీయంగా తగ్గి రూ.87 కోట్ల నుంచి రూ.28 కోట్లకు వచ్చి చేరాయి.

1.69 శాతంగా ఉన్న స్థూల ఎన్‌పీఏలు 1.36 శాతానికి (రూ.195) తగ్గాయి. ఎన్‌పీఏల విషయంలో సమర్థంగా పనిచేయడం వల్లే ఈ స్థాయి లాభాలు ఆర్జించామని ఏపీజీవీబీ చైర్మన్‌ వి.నర్సిరెడ్డి మంగళవారమిక్కడ మీడియాకు తెలియజేశారు. నిర్వహణ లాభం 43.58 శాతం పెరిగి రూ.750 కోట్లకు చేరుకుంది. నెట్‌వర్త్‌ 29 శాతం పెరిగి రూ.2,253 కోట్లకు చేరిందని, ఆర్‌ఆర్‌బీల్లో అగ్రస్థానంలో నిలిచామని చెప్పారాయన.
 

ఈ ఏడాది 20 శాతం వృద్ధి..
2017–18లో డిపాజిట్లు 12 శాతం పెరిగి రూ.14,333 కోట్లకు, అడ్వాన్సులు 16 శాతం అధికమై రూ.14,316 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారంలో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు నర్సిరెడ్డి తెలిపారు. ’‘5,000 జనాభా ఉన్న తెలంగాణ, ఆంధప్రదేశ్‌లోని అన్ని గ్రామాల్లోనూ సేవలు విస్తరించాం. 80 కొత్త శాఖలు/ బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమించనున్నాం.

ఇప్పటికే 760 శాఖలు, 1,860 కరస్పాండెంట్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాం. ఏపీజీవీబీలో వాటా విక్రయ ప్రక్రియ ఏడాదిలో పూర్తవుతుంది. సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, ఎస్‌బీఐకి 35, ఏపీ/తెలంగాణకు 15 శాతం వాటా ఉంది. బ్యాంకుకు రూ.30,000 కోట్లుగా విలువ కట్టాం. 15 శాతం వాటా విక్రయించే అవకాశం ఉంది. ఐపీవో వైపే మేము మొగ్గు చూపిస్తున్నాం’’ అని ఆయన వివరించారు.

Advertisement
Advertisement