ఐఫోన్ 6ఎస్ రోజ్ గోల్డ్ హల్‌చల్.. | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 6ఎస్ రోజ్ గోల్డ్ హల్‌చల్..

Published Mon, Oct 5 2015 8:35 AM

ఐఫోన్ 6ఎస్ రోజ్ గోల్డ్ హల్‌చల్..

ఔట్‌లెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
భారత గ్రే మార్కెట్లో రూ. లక్షకు పైనే
అక్టోబర్ 16న భారత్‌లో విడుదల

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఫోన్లో ఏ మోడల్ వచ్చినా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్. భారత్‌లో కూడా అందుకు మినహాయింపు ఏమీ లేదు. ఇక్కడి కస్టమర్లు మరికాస్త స్మార్ట్. భారత్‌లో అధికారికంగా విడుదలకు ముందే తమ చేతుల్లో కొత్త మోడల్ ఉండాల్సిందేనని అంటున్నారు. ఇందుకోసం ప్రీమియం ఎంతైనా చెల్లిస్తున్నారు. ఐఫోన్ కొత్త మోడళ్లు అయిన 6ఎస్, 6ఎస్ ప్లస్ సెప్టెంబర్ 25న యూఎస్, యూకే సహా 12 దేశాల్లో విడుదలయ్యాయి. భారత్‌లో అక్టోబర్ 16న విడుదల కానున్నాయి. అయితే భాగ్యనగరానికి చెందిన ఒక కస్టమర్ సెప్టెంబర్ 26నే 6ఎస్‌ను చేజిక్కించుకున్నారంటే ఇక్కడివారి ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఫోన్ కోసం ఆయన చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.1.20 లక్షలు. భారత్ గ్రే మార్కెట్లో ఈ ఫోన్ రూ. లక్షకుపైగానే పలుకుతోందని వ్యాపార వర్గాలు తెలిపాయి. నలుగురిలో ప్రత్యేకత ప్రదర్శించాలనుకునే ఇటువంటి ‘విలువైన’ కస్టమర్ల కోసం హాంకాంగ్, సింగపూర్ నుంచి కొందరు వ్యాపారులు ఫోన్లను తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏడుగురు యువకుల నుంచి ఏకంగా 182 ఫోన్లను కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకోవడం గమనార్హం.

 రోజ్ గోల్డ్‌కే పట్టం..
 ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ మోడళ్లను సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో ఆపిల్ రూపొంది ంచింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన రోజ్ గోల్డ్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీత డిమాండ్ ఉంది. నల్ల బజారులో అధిక ధర పలుకుతున్న రంగు కూడా ఇదే కావడం విశేషం. ఆ తర్వాతి స్థానాన్ని స్పేస్ గ్రే కైవసం చేసుకుంది. చైనాలో అతిపెద్ద గ్రే మార్కెట్ అయిన హువాకియాంగ్‌బేలో రోజ్ గోల్డ్ రూ.2.15 లక్షలు పలికింది. ఐఫోన్ 5ఎస్ మోడల్‌ను తొలిసారిగా బంగారు వర్ణంలో ప్రవేశపెట్టినప్పుడు సైతం గ్రే మార్కెట్లో భారత్‌లో రూ.లక్షకు పైనే పలికింది. కాగా, 6ఎస్, 6ఎస్ ప్లస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో 70% మంది రోజ్ గోల్డ్‌ను కోరారని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. బిగ్ సి, లాట్‌లోనూ బుకింగ్స్‌లో 70% మంది ఇదే కలర్‌ను ఎంచుకున్నారు.

 భారీ అంచనాలతో..
 కొత్త మోడళ్లపై ఆపిల్‌కు భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలైన 3 రోజుల్లోనే 1.3 కోట్ల యూనిట్లు అమ్ముడవడమే ఇందుకు కారణం. భారత్‌లో ఈ అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో 7.2 లక్షల యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా ఆపిల్ లక్ష్యంగా చేసుకుంది. అటు రిటైలర్లు ముందస్తు బుకింగ్స్‌ను ప్రారంభించారు. 500 బుకింగ్స్ నమోదయ్యాయని బిగ్ సీ చైర్మన్ బాలు చౌదరి తెలిపారు. 1,500 యూనిట్ల అమ్మకాలను దాటతామన్నారు. 400లకుపైగా బుకింగ్స్ అయ్యాయని, 1,300లకుపైగా యూనిట్లను విక్రయిస్తామన్న అంచనాలు ఉన్నాయని లాట్ మొబైల్స్ ఈడీ కృష్ణ పవన్ చెప్పారు. టెక్నోవిజన్ ఇప్పటికే 100కుపైగా బుకింగ్స్‌ను నమోదు చేసింది. భారత్‌లో 6ఎస్ ధర 16 జీబీ రూ.55,000, 64 జీబీ రూ.65,000, 128 జీబీ రూ.75,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 6ఎస్ ప్లస్ ధర వేరియంట్‌నుబట్టి అదనంగా రూ.8-9 వేలు ఉండొచ్చు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement