రేపటినుంచి ‘టోల్‌’ బాదుడు!

31 Mar, 2018 12:54 IST|Sakshi

‘టోల్‌’ బాదుడు షురూ

ఐదు నుంచి 7 శాతం చార్జీలు  పెంపు

ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు

సాక్షి, న్యూఢిల్లీ:జాతీయ రహదారులపై ప్రయాణించే వాహన చోదకులకు ఇక మరో టోల్‌ బాదుడు తప్పదు. మార్చి31 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్న కొత్త టోల్‌చార్జీలు నేపథ్యంలో జాతీయ రహదారులపై డ్రైవింగ్ మరింత భారం కానుంది. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్ రేట్లును  5నుంచి 7శాతం  పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మెజారీటి టోల్‌ ప్లాజాలపై  అన్ని రకాల వాహనాలపై టోల్‌ చార్జీలు 5శాతం పెరగనున్నాయి.  మంత్లీ ప్లాన్‌లో (నెలకు 50 ట్రిప్పులు) ధరలను కూడా నేషనల్‌ హైవే అథారిటీ పెంచింది. ఫలితంగా నిత్యావసర ధరలు కూడా ఈ మేరకు భగ్గుమనడం ఖాయం.

జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏటా ఏప్రిల్‌ నెలలో చార్జీలను పెంచుతున‍్న సంగతి విదితమే.  ఈ‍ క్రమంలో  ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పెంచిన టోల్‌ చార్జీ అమలు కానుంది. నేషనల్ హైవే 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ మొహమ్మద్ సఫీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మొత్తం 372 టోల్ ప్లాజాలున్నాయని చెప్పారు.  టోల్‌రేట్లు కూర్పు ప్రతి ఆర్థికసంవత్సరం ప్రారంభం కావడానికి ముందే జరుగుతుందని వివరించారు.  ముఖ్యంగా టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారంగా రేట్లు సవరణ ఉంటుందనీ, అయితే ఆయా ప్రాంతాలనుబట్టి రేట్లు మారతాయన్నారు.

మరోవైపు ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్‌చార్జీలు అధికంగా ఉన్నా,మళ్లీ  రేట్లు పెంచడం అసమంజసమనే ఆందోళన సర్వత్రా వ్యకమవుతోంది. ఈ పెంపుపై  ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్ఫేర్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒకవైపు ఇ-వే బిల్లు, పెరిగిన డీజిల్‌ ధరలకు తోడు టోల్‌ చార్జీలపెంపు కారణంగా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా  పెరుగుతాయని పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు