నిప్పన్‌ స్టీల్‌తో ఆర్సెలర్‌ మిట్టల్‌ జట్టు | Sakshi
Sakshi News home page

నిప్పన్‌ స్టీల్‌తో ఆర్సెలర్‌ మిట్టల్‌ జట్టు

Published Sat, Mar 3 2018 12:43 AM

Arcelormittal team with Nippon Steel - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో భాగంగా జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటోమో మెటల్‌ కార్పొరేషన్‌తో (ఎన్‌ఎస్‌ఎస్‌ఎంసీ) ఆర్సెలర్‌ మిట్టల్‌ చేతులు కలిపింది. నిప్పన్‌తో జాయింట్‌ వెంచర్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది. భారీ మొండిబాకీలతో దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న 12 కంపెనీల్లో ఎస్సార్‌ స్టీల్‌ ఒకటి. దీన్ని కొనుగోలు చేస్తే భారత మార్కెట్లో కీలకంగా ఎదగొచ్చనే ఉద్దేశంతో ఎస్సార్‌ స్టీల్‌ కోసం ఆర్సెలర్‌మిట్టల్‌ బరిలో నిలిచింది.

కంపెనీని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను ఆర్సెలర్‌ మిట్టల్‌ ఇండియా (ఏఎంఐపీఎల్‌) ఫిబ్రవరి 12న అందజేసింది కూడా. తమ ప్రణాళికకు గానీ ఎన్‌సీఎల్‌టీ ఆమోద ముద్ర వేస్తే నిప్పన్‌తో కలసి ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేస్తామని, సంయుక్తంగా సంస్థ నిర్వహణ చేపడతామని ఆర్సెలర్‌ మిట్టల్‌ చైర్మన్‌ లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు. 1987 నుంచి ఆర్సెలర్‌ మిట్టల్, నిప్పన్‌ స్టీల్‌ కలసి అమెరికాలోని ఇండియానాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇటీవలే అమెరికాలోని అలబామాలో కాల్వర్ట్‌ ఉక్కు ప్లాంటును కూడా కొనుగోలు చేశాయి. ఆర్సెలర్‌ మిట్టల్‌కి 60 పైగా దేశాల్లో కార్యకలాపాలున్నాయి.   

Advertisement
Advertisement