ఇక ఆర్ బీఐతో పాటే బ్యాంకులూ..! | Sakshi
Sakshi News home page

ఇక ఆర్ బీఐతో పాటే బ్యాంకులూ..!

Published Tue, Apr 5 2016 10:14 AM

ఇక ఆర్ బీఐతో పాటే బ్యాంకులూ..!

కస్టమర్లకు వెంటనే వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనం
నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష...
పావు నుంచి అర శాతం రేట్ల కోత అంచనాలు...

 ముంబై: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక పాలసీ సమీక్ష నేపథ్యంలో రేట్లకోతపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు(మంగళవారం) చేపట్టనున్న ఈ ఆర్థిక సంవత్సరం తొలి సమీక్షలో కచ్చితంగా పావు శాతం పాలసీ రేట్ల కోతకు అవకాశం ఉందని అటు బ్యాంకర్లు, ఇటు ఆర్థిక విశ్లేషకుల్లో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే అర శాతం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం సోమవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకోవాలంటే రేట్ల తగ్గింపు చాలా అనివార్యమంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఈసారి ఎలాగైనా రేట్లను తగ్గించాలంటూ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నిర్ణయంపై స్టాక్ మార్కెట్‌తోపాటు పారిశ్రామిక రంగం చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

 ‘పొదుపు’ రేటు కోత తోడ్పాటు: గత పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులూ చేయడం లేదు కూడా. దీంతో రెపోరేటు(ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ) 6.75 శాతంగానే కొనసాగుతోంది. దీనికి ముడిపడి ఉండే రివర్స్ రెపో(బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై లభించే వడ్డీరేటు) 5.75 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్-బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధులు) 4 శాతంగా ప్రస్తుతం ఉన్నాయి.

బడ్జెట్‌లో ద్రవ్యలోటు కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటం... చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను భారీగా తగ్గించిన నేపథ్యంలో ఈ సారి ఆర్‌బీఐ రేట్లకోతకు మార్గం మరింత సుగమం అయిందని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. మరోపక్క, ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ యెలెన్ వడ్డీరేట్లను మరింత పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఆర్‌బీఐకి రేట్ల కోతపై వెసులుబాటు లభించే అంశమని పరిశీలకులు పేర్కొంటున్నారు.

బ్యాంకులూ తగ్గించాల్సిందే...
రుణ రేట్ల ఖరారుకు ఇప్పటివరకూ అనుసరిస్తున్న విధానానికి బదులు.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్(ఎంసీఎల్‌ఆర్) పద్ధతిని పాటించాలన్న ఆర్‌బీఐ ఆదేశాలతో బ్యాంకులన్నీ దీనికి ఇప్పటికే ఓకే చెప్పాయి. కొన్ని బ్యాంకులు రుణ రేట్లలో మార్పులు చేపట్టాయి కూడా. ప్రధానంగా ఆర్‌బీఐ గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును 1.25 శాతం మేర తగ్గించినప్పటికీ.. బ్యాంకులు ఇందులో సగాన్ని మాత్రమే రుణ రేటు తగ్గింపు రూపంలో తమ ఖాతాదారులకు బదలాయించాయి. దీంతో ఆర్‌బీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దీనిప్రకారం కొత్తగా ఫిక్స్‌డ్ రేట్ డిపాజిట్లకు ఆఫర్ చేస్తున్న వడ్డీరేటుకు అనుగుణంగా తమ రుణ రేట్లను ఎప్పటికప్పుడు సవరించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆర్‌బీఐ పాలసీ రేట్లను తగ్గించిన ప్రతిసారీ రుణ రేట్ల విషయంలో కూడా ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాల్సిందే.

Advertisement
Advertisement