పన్ను రేటు సహేతుకంగా ఉండాలి: జైట్లీ | Sakshi
Sakshi News home page

పన్ను రేటు సహేతుకంగా ఉండాలి: జైట్లీ

Published Mon, Jul 4 2016 1:25 AM

పన్ను రేటు సహేతుకంగా ఉండాలి: జైట్లీ - Sakshi

పన్ను ఎగవేత మార్గాలను మూసేస్తున్నామని వెల్లడి  
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రేటును సహేతుక స్థాయిలో ఉంచడమే ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖలు సంయుక్తంగా శనివారం నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి జైట్లీ మాట్లాడారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచుకునే విషయమై ఆయన మాట్లాడుతూ... రిటర్నులు దాఖలు చేసే వారిని ఆదాయపన్ను శాఖ విశ్వసించడం ప్రారంభించాలని సూచించారు.

గత కొన్ని నెలల కాలంలో విధానాలు సులభతరం అయ్యాయని, ఐటీ శాఖ రిటర్నులు దాఖలు చేసే వారి పట్ల ఇంత స్నేహపూరితంగా వ్యవహరించడాన్ని ఎప్పుడూ చూసి ఉండరని అభిప్రాయపడ్డారు. విధానాలను సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టిన పలు చర్యలను జైట్లీ ప్రస్తావించారు.
 
ఎగవేత దారులపై కఠిన చర్యలు
అదే సమయంలో పన్ను ఎగవేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జైట్లీ హెచ్చరించారు. తప్పించుకునే మార్గాలకు చెక్ పెడుతున్నట్టు తెలిపారు. హెచ్‌ఎస్‌బీసీలో అక్రమంగా ఖాతాలు కలిగి ఉన్నవారు విచారణ ఎదుర్కొంటున్నారని, పనామా పేపర్లలో ఉన్న వారు సైతం విచారణ ఎదుర్కొనక తప్పదన్నారు. మారిషస్‌తో ఉన్న ఒప్పందాన్ని సవరించామని, భారత్‌లో ఆర్జిస్తూ పన్ను ఎగ్గొట్టే అవకాశం ఇకపై ఉండబోదన్నారు.

సైప్రస్‌తో ఉన్న ఒప్పందాన్ని కూడా సమీక్షించామని వచ్చే కొన్ని రోజుల్లో దీన్ని కేబినెట్ ఆమోదించనున్నట్టు వెల్లడించారు. సింగపూర్‌తో ఉన్న ద్వైపాక్షిక పన్ను ఒప్పందాన్ని సవరించే విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. దేశంలో పన్ను రేటు సహేతుక స్థాయిలో ఉండాలని, చెల్లింపుదారుల సంఖ్య భారీగా ఉండాలని, ఐటీ విభాగం పన్ను చెల్లింపు దారులను, రిటర్నులు దాఖలు చేసే వారిని విశ్వసించాలని జైట్లీ అన్నారు. తమ ఆదాయాన్ని దాచి పెట్టి ఉంచిన వారికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం ఓ మంచి అవకాశంగా పేర్కొన్నారు.

Advertisement
Advertisement