Sakshi News home page

వృద్ధికి అధిక సమయం కష్టపడతాం: అరుణ్ జైట్లీ

Published Sat, Dec 13 2014 5:53 AM

వృద్ధికి అధిక సమయం కష్టపడతాం: అరుణ్ జైట్లీ - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక పురోభివృద్ధి కోసం తమ ప్రభుత్వం మరింత అధికంగా కష్టపడనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఇందుకు వీలుగా సంస్కరణలకు ఊపునిచ్చేందుకు అధిక సమయాన్నికేటాయించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా బీమా, బొగ్గు రంగాలతోపాటు, వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) వంటి సంస్కరణల అమలుకి గట్టిగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.

వచ్చే ఏడాదిలో జీడీపీలో 6-6.5% వృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ బాటలో వచ్చే వారం బీమా బిల్లును చేపట్టనున్నట్లు వివరించారు. ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో జైట్లీ ఈ విషయాలను వెల్లడించారు. జీఎస్‌టీ కోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

2017లో 7% వృద్ధి
వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో 6.5% ఆర్థిక వృద్ధిని సాధించగలమని నమ్ముతున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఆపై ఏడాది(2016-17)కి జీడీపీ 7% స్థాయిలో విస్తరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారీ మార్పులకు చోటుకల్పించే కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడం లేదన్న విమర్శలపై స్పందిస్తూ జైట్లీ ప్రణాళికా సంఘం రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయాలను వీళ్లు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత అంశాన్ని ప్రస్తావించారు. వ్యయాల కమిషన్ నివేదిక అందిన తరువాత ప్రజాసంబంధ వ్యయాల క్రమబద్ధీకరణకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సబ్సిడీలను కుదించనున్నట్లు తెలిపారు. బ్లాక్‌మనీ అంశంపై వివరణ ఇస్తూ 2015 మార్చి 31కల్లా 627 ఖాతాల పరిశీలన పూర్తి చేయనున్నట్లు చెప్పారు.   
 
జైట్లీతో రాజన్ సమావేశం
న్యూఢిల్లీ: కీలక పాలసీ రేట్ల తగ్గింపునకు ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. జైట్లీతో వివిధ ఆర్థిక అంశాలపై చర్చించినట్లు సమావేశం అనంతరం రాజన్ విలేకరులకు తెలియజేశారు. వడ్డీ తగ్గింపుపై ఒత్తిళ్ల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
 
ఆర్‌బీఐతో చెట్టపట్టాల్: కాగాఆర్‌బీఐతో ప్రభుత్వం కలసికట్టుగా పనిచేస్తుందని ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఆరోగ్యకరమైన రీతిలో వాదోపవాదాలు కొనసాగడం సహ జమని ఒక ఇంటర్వ్యూలో జైట్లీ వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ అనేది అనుభవం, నైపుణ్యాలు కలగలసిన సంస్థ అని, తమ బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించడంపైనే దృష్టిపెడుతుందన్నారు.

Advertisement
Advertisement