Sakshi News home page

అరబిందో ఫార్మా బోనస్ ఇష్యూ

Published Fri, May 29 2015 1:42 AM

అరబిందో ఫార్మా బోనస్ ఇష్యూ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో నికరలాభం 20 శాతం క్షీణించి రూ. 404 కోట్లకు పరిమితమయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 502 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 2,306 కోట్ల నుంచి రూ. 3,142 కోట్లకు చేరింది. ఏడాది మొత్తం మీద అరబిందో ఫార్మా రూ. 12,043 కోట్ల ఆదాయంపై రూ. 1,576 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. వాటాదారులకు ప్రతీ షేరుకు అదనంగా మరో షేరును బోనస్‌గా జారీ చేయాలని గురువారం సమావేశమైన బోర్డులో నిర్ణయం తీసుకున్నారు.

ఈ బోనస్ షేర్లకు ఇంకా రికార్డు తేదీని నిర్ణయించలేదు. ఈ నిర్ణయానికి జూలై 9న జరిగే అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఆమోదం లభించాల్సి ఉందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. 2014-15 ఏడాదికి  మూడో  మధ్యంతర డివిడెండ్ కింద రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు రూపాయి ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది.
 
అరబిందో షేర్ బీఎస్‌ఈలో 2.5 శాతం క్షీణించి రూ.1,304 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement