యాక్సిస్ బ్యాంక్ | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంక్

Published Sat, Apr 26 2014 1:45 AM

యాక్సిస్ బ్యాంక్

ముంబై: ప్రైవేట్ రంగంలో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్ యాక్సిస్.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 1,842 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది అంత క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4తో పోలిస్తే 18 శాతం అధికం. అప్పట్లో దాదాపు రూ. 9,055 కోట్ల ఆదాయంపై రూ. 1,555 కోట్ల లాభం ఆర్జించింది. తాజా క్యూ4లో ఆదాయం రూ. 10,179 కోట్లకు పెరిగింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. నికర వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ. 2,665 కోట్ల నుంచి రూ. 3,166 కోట్లకు చేరింది.

 నికర వడ్డీ మార్జిన్(నిమ్) సైతం 3.70 శాతం నుంచి 3.89%కి పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను 200% మేర(రూ.20) డివిడెండ్ ఇవ్వాలని యాక్సిస్ బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 180 శాతం (రూ. 18) డివిడెండ్ ఇచ్చింది. మరోవైపు, బ్యాంక్ బోర్డు.. షేర్ల విభజన ప్రతిపాదనను ఆమోదించింది. దీని ప్రకారం రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 2 ముఖ విలువ గల 5 షేర్ల కింద విభజిస్తారు.

 ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను .. యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 20 శాతం ఎగిసింది. రూ. 5,179 కోట్ల నుంచి సుమారు రూ. 6,218 కోట్లకు పెరిగింది. తొలిసారిగా బిలియన్ డాలర్ల మేర నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ. 33,734 కోట్ల నుంచి రూ. 38,046 కోట్లకు పెరిగింది. బాసెల్ త్రీ నిబంధనల ప్రకారం మార్చి ఆఖరు నాటికి మూలధన నిష్పత్తి (సీఏఆర్) 16.07 శాతంగా ఉన్నట్లు బ్యాంక్ వివరించింది. నికర వడ్డీ ఆదాయం, ఫీజుల కారణంగా లాభాలు గణనీయంగా పెరిగాయని యాక్సిస్ ఈడీ సోమ్‌నాథ్ సేన్‌గుప్తా వివరించారు. రియల్టీ, కార్లు.. వాణిజ్య వాహన రుణాల విభాగాల్లో పనితీరు కొంత మందకొడిగా ఉందని, అయితే సెంటిమెంట్ కొంతైనా మెరుగుపడితే పరిస్థితుల్లో మార్పు రాగలదని తెలిపారు.

 1.22 శాతానికి స్థూల ఎన్‌పీఏలు..
 బ్యాంక్ ఇచ్చిన రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 1.22%కి పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 1.06 శాతంగా ఉన్నాయి. అటు నికర ఎన్‌పీఏలు సైతం 0.32% నుంచి 0.40%కి పెరిగాయి.
 యాక్సిస్ బ్యాంక్ షేర్ల ధర బీఎస్‌ఈలో సుమారు 1.10 శాతం పెరిగి రూ. 1,534.45 వద్ద ముగిసింది.
 

Advertisement
Advertisement