మొబైల్స్ ఎంపిక మరింత స్మార్ట్.. | Sakshi
Sakshi News home page

మొబైల్స్ ఎంపిక మరింత స్మార్ట్..

Published Thu, May 7 2015 12:40 AM

మొబైల్స్ ఎంపిక మరింత స్మార్ట్..

* స్మార్ట్ వ్యూతో సమయం ఆదా  
* ప్రారంభమైన బైస్మార్ట్.కామ్ సేవలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఏ మోడల్ బాగుంటుందో అని స్నేహితులను అడుగుతాం. లేదా వెబ్‌సైట్లో వచ్చిన రివ్యూలను (సమీక్ష) చదువుతాం. ఇవే సమీక్షలను ఆధారంగా చేసుకుని కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే, పనితీరునుబట్టి ఒక్క క్లిక్‌తో మోడళ్లను సిఫార్సు చేసే వ్యవస్థ ఉంటే! హైదరాబాద్‌కు చెందిన ఎనిక్‌స్టా ఇన్నోవేషన్స్ ప్రపంచంలో తొలిసారిగా వినూత్న విధానంతో బైస్మార్ట్.కామ్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

లక్షలాది కస్టమర్ల రివ్యూలను ఆధారంగా చేసుకుని మోడళ్లకు స్కోర్ ఇవ్వడంతోపాటు ‘స్మార్ట్ వ్యూ’ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఏ మోడల్ కొనొచ్చో శాస్త్రీయ పద్ధతిలో సూచించడంతోపాటు సమయమూ ఆదా అయ్యేందుకు ఈ వెబ్‌సైట్ తోడ్పడుతుంది.
 
మానవ ప్రమేయం లేకుండా..
ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న 5 వేలకుపైగా సెల్‌ఫోన్ మోడళ్ల వివరాలను బైస్మార్ట్.కామ్‌లో పొందుపరిచారు. 10 లక్షలకుపైగా రివ్యూలు, సెల్‌ఫోన్లకు చెందిన 50 వేల స్పెసిఫికేషన్ల ఆధారంగా స్కోర్లు ఇచ్చారు. ప్రతి మోడల్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ప్రధాన రివ్యూలనూ వీడియోలతోసహా చూడొచ్చు. స్కోర్ ఇవ్వడంలో మానవ ప్రమేయం లేదని, పూర్తిగా యాంత్రిక పద్ధతి (అల్గోరిథమ్) అనుసరిస్తున్నట్టు కంపెనీ వ్యవస్థాపకులు గిరి దేవనాథన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘రివ్యూల్లో అక్షర దోషాలున్నా, వ్యంగ్య పదాలున్నా ఈ టెక్నాలజీ అర్థం చేసుకుంటుంది. ప్రొడక్ట్ ఎంపిక పూర్తిగా వినియోగదార్లదే’ అని చెప్పారు.
 
ఇతర ఉత్పత్తులకూ..
రానున్న రోజుల్లో ఈ విధానాన్ని ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్ పీసీలు, కెమెరాలు, కార్లకు విస్తృతం చేయనున్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా మోడళ్లను పోల్చవచ్చు. ఫోన్లను కొనుక్కోవచ్చు కూడా. ఇక గిరి దేవనాథన్‌కు పేపాల్, నోకియా, యాహూ, ఈబే వంటి కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. కంపెనీకై ఇప్పటి వరకు రూ.2 కోట్లు వ్యయం చేశారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, నాప్‌టోల్‌తో ఎనిక్‌స్టా ఒప్పందం చేసుకుంది. కొద్ది రోజుల్లో ఆఫ్‌లైన్ స్టోర్లతోనూ చేతులు కలుపనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement