బ్యాంకుల బంద్‌; సేవలు నిల్‌! | Sakshi
Sakshi News home page

బ్యాంకుల బంద్‌; సేవలు నిల్‌!

Published Wed, Aug 23 2017 12:51 AM

బ్యాంకుల బంద్‌; సేవలు నిల్‌!

 ముగిసిన పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగుల ఒకరోజు సమ్మె  
న్యూఢిల్లీ: ఉద్యోగుల సమ్మెతో మంగళవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేటు బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. నగదు బదిలీలు, చెక్కుల క్లియరెన్స్, నగదు జమలు, ఉపంసహరణలు తదితర సేవలకు అంతరాయం కలిగింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మాదాబాద్, బెంగళూరు, పాట్నా, చెన్నై, పుణె, జైపూర్‌ తదితర నగరాల్లో సమ్మె ప్రభావం పూర్తిగా కనిపించింది. ముఖ్యంగా ఏటీఎంలలో నగదు లేక జనం ఇబ్బందులు పడ్డారు.

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకుల్లో మాత్రం సేవలు యథావిధిగా కొనసాగాయి. బ్యాంకుల విలీనాలు సహా పలు అంశాలపై వివిధ బ్యాంకు ఉద్యోగుల ఉమ్మడి సంఘమైన యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. కాగా, అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం దీనిపై మాట్లాడుతూ... ‘‘మరింతగా బ్యాంకు సేవల అవసరం ఉన్న ఈ సమయంలో బ్యాంకుల స్థిరీకరణ, బ్యాంకుల విలీనాల గురించి ప్రభుత్వం మాట్లాడుతోంది.

బ్యాంకుల విలీనాలతో బ్యాంకు శాఖలు మూతపడతాయి. అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకున్న ఎస్‌బీఐ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. విలీనాల ద్వారా పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయడం వల్ల రిస్క్‌ కూడా పెరుగుతుంది’’ అని ప్రభుత్వ తీరును విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల గ్రాట్యుటీని తక్షణమే రూ.20 లక్షలకు పెంచాలని ఆల్‌ ఇండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఫ్రాంకో డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement