బీఈఎల్‌ వాటాల విక్రయం ప్రారంభం

23 Feb, 2017 01:34 IST|Sakshi
బీఈఎల్‌ వాటాల విక్రయం ప్రారంభం

2.3 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబయిన సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా
నేడు రిటైల్‌ ఇన్వెస్టర్లకు వాటా విక్రయం
ఫ్లోర్‌ ధరలో 5 శాతం డిస్కౌంట్‌


న్యూఢిల్లీ:  వైమానిక, రక్షణ రంగ కంపెనీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌(బీఈఎల్‌) వాటా విక్రయానికి బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. బీఈఎల్‌లో 5 శాతం వాటాను (1.11 కోట్ల షేర్లు)ను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ప్రభుత్వం విక్రయిస్తున్నది. ఒక్కో షేర్‌కు కనీస బిడ్డింగ్‌(ఫ్లోర్‌) ధర రూ.1,498గా వుంది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.1,600 కోట్లు సమకూరుతాయని అంచనా.

మొత్తం వాటా విక్రయంలో  సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 89.34 లక్షల షేర్లకు గాను 2.09 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. వీటి విలువ రూ.3,100 కోట్లు. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 2.34 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. నేడు(గురువారం) రిటైల్‌ ఇన్వెస్టర్లకు వాటా విక్రయించనున్నారు. షేర్‌ అలాట్‌మెంట్‌ ధరలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్‌ఈలో బీఈఎల్‌ షేర్‌ 3% క్షీణించి రూ.1,510 వద్ద ముగిసింది.  బీఈఎల్‌లో ప్రభుత్వానికి 74.41 శాతం వాటా ఉంది.

మరిన్ని వార్తలు