భారతి ఎయిర్‌టెల్‌కు ఊరట | Sakshi
Sakshi News home page

భారతి ఎయిర్‌టెల్‌కు ఊరట

Published Fri, Jun 2 2017 1:30 PM

భారతి ఎయిర్‌టెల్‌కు ఊరట

ముంబై:  దేశీయ టెలీ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌కు  సెబీ ద్వారా భారీ ఊరట లభించింది.   ఎయిర్‌ టెల్‌ టెలినార్‌ డీల్‌ కి  సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జియో షాక్‌ తో  ఇబ్బందుల్లో పడిన ఎయిర్‌టెల్‌ ఉపశమనం లభించనుంది. నార్వే టెలికాం ఆపరేటర్ టెలినార్ భారతీయ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నందుకు సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆమోదం లభించిందని ఎయిర్‌టెల్‌ రెగ్యులేటరీ  ఫైలింగ్‌ లో చెప్పింది.

టెలినార్‌ కమ్యూనికేషన్స్‌ను విలీనం చేసుకునేందుకు అటు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందిన వార్తలతో  మార్కెట్లో భారతీ ఎయిర్‌టెల్‌ కౌంటర్‌ బాగా పుంజుకుంది. దాదాపు 3 శాతానికిపైగా జంప్‌చేసింది.  మరోవైపు టెలినార్‌, ఎయిర్‌టెల్‌  విలీన ఆమోదానికి గాను  భారతి, టెలినార్ రెండూ కలిసి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి)  ఢిల్లీ బెంచ్‌ వద్ద   దరఖాస్తును దాఖలు చేశాయి.  అలాగే ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టబద్ధమైన ఆమోదాన్ని  కూడా పొందాల్సి ఉంది.

కాగా ఫిబ్రవరి 23 న టెలినార్ ను కొనుగోలు చేయనున్నామని ఎయిర్‌ టెల్‌ భారత్ ప్రకటించింది.  ఈ విలీనం  ద్వారా  రెవెన్యూ మార్కెట్ వాటాను 35 శాతానికి పెంచుకోవడమే కాకుండా  గుజరాత్‌,మహారాష్ట్ర,  ఉత్తరప్రదేశ్‌ లో  మరింత బలోపేతం కానున్నట్టు తెలిపింది.  టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్క దెబ్బతో మిగతా టెలికాం కంపెనీలన్ని కుదేలయ్యాయి.  ఈ నేపథ్యంలో   ఎయిర్‌టెల్‌, టెలినార్‌ విలీనం ప్రాధాన్యతను సంతరించుకోనుంది.    జియో  ఎంట్రీతో వోడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ కూడా విలీన బాటలో పయనిస్తున్న సంగతి తెలిసిందే.   అప్పుల ఊబిలో   కూరుకు పోయిన ఆర్‌ కాం, ఎయిర్సెల్ వంటి ఇతర ఆపరేటర్లపై   తీవ్ర  ఒత్తిడిని పెంచింది.  
 

Advertisement
Advertisement