కుబేరులు.. 100 దాటారు! | Sakshi
Sakshi News home page

కుబేరులు.. 100 దాటారు!

Published Wed, Mar 22 2017 1:06 AM

కుబేరులు.. 100 దాటారు!

దేశంలో 101కి చేరిన బిలియనీర్ల సంఖ్య
శ్రీమంతులు అధికంగా ఉన్న 4వ దేశంగా భారత్‌
ముకేశ్‌ అంబానీకే అగ్రపీఠం; గ్లోబల్‌ లిస్ట్‌లో బిల్‌ గేట్స్‌ టాప్‌
ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితా విడుదల
 

న్యూయార్క్‌: భారత్‌లో 101 మంది కుబేరులున్నారు. శ్రీమంతుల సంఖ్య సెంచరీ దాటడం ఇదే తొలిసారి. వీరందరిలోకెల్లా రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ టాప్‌లో నిలిచారు. ఈయన సంపద విలువ 23.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అదే అంతర్జాతీయంగా చూస్తే ముకేశ్‌ అంబానీది 33వ స్థానం. ఫోర్బ్స్‌ ‘ప్రపంచ కుబేరులు–2017’ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 2.043 మంది కుబేరులకు స్థానం లభించగా... ఈ సారి కూడా మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్సే అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. వివరాలివీ...

జాబితాలోని 2,043 మంది శ్రీమంతుల మొత్తం సంపద విలువ 7.67 ట్రిలియన్‌ డాలర్లు. గతేడాదితో పోలిస్తే ఇందులో 18 శాతం వృద్ధి నమోదయింది.  
జాబితాలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ వరసగా నాలుగో సారి అగ్రస్థానంలో నిలవగా... ఈయన సంపద విలువ 86 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.
గేట్స్‌ తర్వాతి స్థానంలో బెర్క్‌షైర్‌ హాత్‌వే చీఫ్‌ వారెన్‌ బఫెట్‌  (75.6 బిలియన్‌ డాలర్లు), అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ (72.8 బిలియన్‌ డాలర్లు) నిలిచారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 3.5 బిలియన్‌ డాలర్లతో 544వ స్థానంలో ఉన్నారు.
కుబేరుల సంఖ్య అమెరికాలోనే ఎక్కువ. ఇక్కడ 565 మంది శ్రీమంతులున్నారు. చైనాలో 319 మంది, జర్మనీలో 114 మంది, ఇండియాలో 101 మంది బిలియనీర్లు ఉన్నారు.
జాబితాలో భారతీయ సంతతికి చెందిన వారు 20 దాకా ఉన్నారు. వీరిలో హిందూజా బ్రదర్స్‌ 15.4 బిలియన్‌ డాలర్ల సంపదతో 64వ స్థానంలో, పల్లోంజి మిస్త్రీ 14.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 77వ స్థానంలో,  ప్రకాశ్‌ లోహియా 5.4 బిలియన్‌ డాలర్ల సంపదతో 288వ స్థానంలో నిలిచారు.
ఆర్సిలర్‌ మిట్టల్‌ చైర్మన్‌ లక్ష్మీ మిట్టల్‌ 56వ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 16.4 బిలియన్‌ డాలర్లు.
అజీమ్‌ ప్రేమ్‌జీ, గౌతమ్‌ అదానీ, రాహుల్‌ బజాజ్, రాకేశ్‌ జున్‌జున్‌వాలా, ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి, నందన్‌ నిలేకని, ఆనంద్‌ మహీంద్రా వంటి భారతీయ వ్యాపారవేత్తలంతా జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
అనిల్‌ అంబానీ 2.7 బిలియన్‌ డాలర్ల సంపదతో 745వ స్థానం సంపాదించారు.
పతంజలి ఆయుర్వేద్‌ ఎండీ ఆచార్య బాలకృష్ణ 814వ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 2.5 బిలియన్‌ డాలర్లు.
పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ 1.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 1,567వ స్థానంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

నలుగురు నారీమణులు
భారత్‌లోని 101 బిలియనీర్లలో నలుగురు మహిళలున్నారు. జిందాల్‌ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్‌ 303వ స్థానంలో నిలిచారు. ఈమె సంపద విలువ 5.2 బిలియన్‌ డాలర్లు. సావిత్రితోపాటు స్మిత కృష్ణ గోద్రేజ్‌ (814వ స్థానం), బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా (973వ స్థానం), యూఎస్‌వీ చైర్‌పర్సన్‌ లీనా తివారీ (1,030వ స్థానం) ఈ జాబితాలో ఉన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement