సంస్కరణల జోరు తగ్గితే పెట్టుబడులకు దెబ్బ | Sakshi
Sakshi News home page

సంస్కరణల జోరు తగ్గితే పెట్టుబడులకు దెబ్బ

Published Thu, Nov 26 2015 3:34 AM

సంస్కరణల జోరు తగ్గితే పెట్టుబడులకు దెబ్బ

జీఎస్‌టీ, భూసేకరణ బిల్లుల ఆమోదం కీలకం
 మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక


 న్యూఢిల్లీ: భారత్‌లో సంస్కరణల జోరు గానీ తగ్గిన పక్షంలో పెట్టుబడుల రాకకు విఘాతం కలిగే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. చాలా మటుకు కార్పొరేట్లు ఆర్థికంగా పటిష్టమైన ఫండమెంటల్స్, సానుకూల ద్ర వ్యపరపతి విధానంతో ప్రయోజనం పొందినా.. సంస్కరణల వేగం తగ్గితే వాటిపై ప్రతికూల ప్రభావం పడగలదని ఒక నివేదికలో పేర్కొంది. అలాగే, అంతర్జాతీయంగా బలహీన మార్కెట్లు, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు కూడా దేశీ వ్యాపారాలపై ప్రభావం చూపవచ్చని వివరించింది.
 
 కీలకమైన వస్తు,సేవల పన్నుల విధానం(జీఎస్‌టీ), భూసేకరణ చట్టాలు మొదలైన సంస్కరణల అమల్లో ప్రభుత్వం విఫలమైతే పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని, సంస్కరణల అవకాశాలు పట్టాలు తప్పిన సంకేతం ఇస్తుందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ హలాన్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.5% స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సాధించి, తయారీ కార్యకలాపాలు మెరుగుపడితే వ్యాపారాల వృద్ధికి తోడ్పాటు అందగలదని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం దిగి వచ్చి వడ్డీ రేట్లు తగ్గడం.. కార్పొరేట్ల ఆదాయాలు మెరుగుపడటానికి ఉపయోగపడగలదని వివరించింది. ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జీఎస్‌టీ తదితర కీలక సంస్కరణలను అమల్లోకి తేలేకపోయిన నేపథ్యంలో మూడీస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
 మరిన్ని సవాళ్లు..
 డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులకు లోను కావడం, కమోడిటీ ధరల తగ్గి .. విదేశీ వాణిజ్యం క్షీణించడం తదితర సమస్యలు దేశీ కంపెనీలకు పొంచి ఉన్నాయని మూడీస్ తెలిపింది. సంస్కరణల జోరు తగ్గితే జీడీపీ వృద్ధి 6 శాతానికి కన్నా దిగువకి పడిపోవచ్చని, ఫలితంగా పరపతి సంబంధిత అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించింది. అలాగే, పెరిగే ద్రవ్యోల్బణం, మారకం రేటు హెచ్చుతగ్గులకు లోను కావడం వల్ల వడ్డీ రేట్లూ పెరగొచ్చని, ఫలితంగా కంపెనీలకు రుణ లభ్యత కఠినతరం కాగలదని పేర్కొంది. ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడితే.. జీడీపీ వృద్ధి 8 శాతం పైగా నిలకడగా ఉండగలదని, ఫలితంగా కార్పొరేట్ల పరపతి కూడా విస్తృతంగా మెరుగుపడగలదని మూడీస్ అంచనా వేసింది.
 
 చమురు ఉత్పత్తి కంపెనీలకు సానుకూలం..
 ఇంధన సబ్సిడీల భారం తగ్గినందున చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు లబ్ధి పొందగలవని మూడీస్ తెలిపింది. అయితే, చమురు, దేశీయంగా గ్యాస్ ధరలు తక్కువ స్థాయిలో ఉండటం వల్ల లాభదాయకత దెబ్బతినవచ్చని వివరించింది. డిమాండ్ పెరుగుదల వల్ల రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీల మార్జిన్లు గణనీయంగా మెరుగుపడగలవని తెలిపింది. రియల్టీ విషయానికొస్తే..వడ్డీ రేట్లు తగ్గడం వల్ల 2016లో డిమాండ్ మెరుగ్గా ఉండొచ్చని మూడీస్ తెలిపింది.
 

Advertisement
Advertisement