వంట నూనెకు డిమాండ్‌ జోరు

26 Jun, 2018 00:28 IST|Sakshi

2030 నాటికి 34 మిలియన్‌ టన్నులకు పెరుగుదల

2017లో 23 మిలియన్‌ టన్నులు

దిగుమతులతో డిమాండ్‌కు కట్టడి 

ముంబై: దేశంలో వంట నూనెల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. 2017లో 23 మిలియన్‌లుగా ఉన్న వినియోగం 2030 నాటికి 34 మిలియన్‌ టన్నులకు పెరగనుంది. ‘దేశంలో భవిష్యత్‌ వంట నూనెల పరిశ్రమ: 2030 నాటికి మరింత డిమాండ్‌ పెరగడానికి కారణాలు’’ అన్న శీర్షికన రెబో రీసెర్చ్‌ సంస్థ ఒక నివేదికను రూపొందించింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి, ఆదాయాలు ఇందుకు అనుగుణంగా వ్యయాలు పెరగడం. పట్టణీకరణ, ఆహార అలవాట్లు మారడం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినేవారి సంఖ్యలో గణనీయ పెరుగుదల వంటి అంశాలు వంట నూనె వినియోగం దూసుకుపోవడానికి కారణం.    2017లో దేశ వంట నూనెల వినియోగం 23 మిలియన్‌ టన్నులయితే వార్షికంగా 7 శాతం పెరుగుతూ, 2030 నాటికి 34 మిలియన్‌ టన్నులకు చేరుతుంది.  
     
దేశీయ వంట నూనెల సరఫరా ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా లేదు. దీనితో వచ్చే దశాబ్ద కాలంలో దిగుమతుల పరిమాణం పెరిగే వీలుంది.  దేశీయ నూనెల పరిశ్రమ వృద్ధి నేపథ్యంలో ప్యాకేజ్డ్‌ వంట నూనెల మార్కెట్‌ విస్తరిస్తుంది. ఈ పరిస్థితుల్లో పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్‌ ఆయిల్స్‌ భవిష్యత్‌లో ప్రాంతీయ మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయే అవకాశం ఉంది.   దేశీయ నూనె గింజల ఉత్పత్తి వృద్ధి డిమాండ్‌కు అనుగుణంగా పెరగడం లేదు.  పెరుగుతున్న వంట నూనెల డిమాండ్‌ – దేశీయ వంట నూనెల సరఫరా మధ్య వ్యత్యాసం గడచిన దశాబ్ద కాలంలో 6.5 మిలియన్‌ టన్నులు– 8.5 మిలియన్‌ టన్నుల శ్రేణిలో ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో 2030 నాటికి వంట నూనెల దిగుమతుల పరిమాణం 25 మిలియన్‌ టన్నులకు చేరే వీలుంది. 2017లో దిగుమతులు 15.5 మిలియన్‌ టన్నులు.  మొత్తం వంట నూనెల దిగుమతుల్లో 98 శాతం పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ఆక్రమించనున్నాయి.  

2030 నాటికి మొత్తం వంట నూనెల దిగుమతుల్లో 60 శాతంతో సింహభాగంలో పామాయిల్‌ ఉంటుంది. మలేషియా, ఇండోనేషియాల నుంచి ప్రధానంగా ఈ దిగుమతులు ఉంటాయి. దక్షిణ అమెరికా సోయా ఆయిల్‌ దిగుమతుల శాతం 24. నల్ల సముద్రం ప్రాంతం నుంచి సన్‌ ప్లవర్‌ అయిల్‌ దిగుమతులు 14 శాతంగా ఉంటాయి.  పామాయిల్‌తో పోల్చితే సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ ధర అధికమే. అయినా భారత్‌కు సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ చమురు దిగుమతుల పరిమాణం వార్షికంగా ఐదు శాతం పెరుగుతుంది. నాణ్యతకు వినియోగదారుల ప్రాధాన్యత దీనికి కారణం. అయితే మొత్తంగా చూస్తే,  దిగుమతయ్యే వంట నూనెల్లో పామాయిల్‌దే సింహభాగం. దిగువ స్థాయి ఆదాయ వర్గం అధికంగా ఉండడమే దీనికి కారణం.   మొత్తం వంట నూనెల వినియోగాన్ని చూస్తే– రిటైల్‌ రంగంలో ప్యాకేజ్డ్‌ విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మొత్తం వినియోగంలో ప్యాకేజ్డ్‌ విక్రయాల వాటా 40 శాతం. వచ్చే ఐదేళ్లలో ఈ విక్రయాలు వార్షికంగా 6 నుంచి 8 శాతం పెరుగుతాయి. 

మరిన్ని వార్తలు