మార్కెట్ పరుగుకు బ్రేక్.. | Sakshi
Sakshi News home page

మార్కెట్ పరుగుకు బ్రేక్..

Published Thu, Jun 25 2015 12:49 AM

మార్కెట్ పరుగుకు బ్రేక్..

8 రోజుల దూకుడుకు పగ్గాలు
 
ముంబై : ఎనిమిది రోజుల మార్కెట్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 75 పాయింట్లు నష్టపోయి, 27,730 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 21 పాయింట్లు నష్టంలో 8,361 వద్ద ముగిసింది. గడచిన ఎనిమిది ట్రేడింగ్ సెషన్స్‌లో సెన్సెక్స్ 1,433 పాయింట్లు లాభపడింది.

 కారణం..!: రుణ సంక్షోభం నుంచి బయటపడటానికి గ్రీస్ ప్రతిపాదనలు ఫలిస్తాయన్న అంచనాలు గత ట్రేడింగ్ సెషన్స్‌లో భారత్‌కు  కలసివచ్చింది. అంచనాలను మించి వర్షాలు కురుస్తుండటంతో రేట్ల కోత ఉండొచ్చన్న సానుకూల అంచనాలు కొనసాగాయి. అయితే రుణ సంక్షోభం పరిష్కార దిశలో గ్రీస్ ప్రతిపాదనను రుణదాతలు తిరస్కరించారన్న తాజా వార్త మార్కెట్ సెంటిమెంట్‌ను బుధవారం దెబ్బతీసింది.

ట్రేడింగ్‌లో అధికభాగం సానుకూలంగానే సాగిన మార్కెట్ గ్రీస్ వార్తతో చివరి గంటలో మైనస్‌లోకి జారిపోయింది. మొత్తంగా గురువారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జూన్ కాంట్రాక్ట్ పూర్తి అవుతున్న నేపథ్యంలో మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. వెరసి బుధవారం  ట్రేడింగ్ ప్రారంభంలోనే 27,948 గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సరికి దాదాపు  200 పాయింట్లు పతనమయ్యింది. నిఫ్టీ సైతం నేటి ట్రేడింగ్‌లో 8,421 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.

 లాభనష్టాల్లో...: 30 సెన్సెక్స్ షేర్లలో 24 నష్టపోయాయి. ట్రేడయిన స్టాక్స్‌లో 1,496 నష్టపోయాయి. 1,222 లాభపడ్డాయి. 134 స్థిరంగా ఉన్నాయి. లాభపడిన సెన్సెక్స్ షేర్లలో బీహెచ్‌ఈఎల్ (4%), హిందుస్తాన్ యునిలివర్ (2.40%), లుపిన్ (2%), సన్ ఫార్మా (2%), విప్రో (1.5%), ఐసీఐసీఐ బ్యాంక్ (1%) ఉన్నాయి.

 టర్నోవర్...
 బీఎస్‌ఈలో టర్నోవర్ రూ.2,629 కోట్లుగా నమోదయ్యింది.  ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.16,050 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,19,991 కోట్లుగా నమోదైంది.

Advertisement
Advertisement