బ్రిటీష్‌ స్టీల్‌ దివాలా  | Sakshi
Sakshi News home page

బ్రిటీష్‌ స్టీల్‌ దివాలా 

Published Thu, May 23 2019 12:24 AM

 British Steel facing bankruptcy within days - Sakshi

లండన్‌: రుణభారం పేరుకుపోయిన బ్రిటిష్‌ స్టీల్‌ సంస్థ దివాలా ఎట్టకేలకు ఖరారైంది. ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావటంతో దివాలా ఖరారయింది. బ్రిటిష్‌ స్టీల్‌ లిమిటెడ్‌ను మూసివేయాలని హైకోర్టు నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆస్తులు విక్రయించి రుణాలను తీర్చాల్సి రానుంది. సంక్షోభ పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా బ్రిటిష్‌ స్టీల్‌కు కొంత మేర నిధులు సమకూర్చింది. అలాగే, బ్రిటిష్‌ స్టీల్, దాని యాజమాన్య సంస్థ గ్రేబుల్‌ క్యాపిటల్‌తో సుదీర్ఘ చర్చలు జరిపింది.

కానీ చివరికి చర్చలు విఫలం కావడంతో దివాలా తప్పలేదు. బ్రిటిష్‌ స్టీల్‌ దివాలాతో 5,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. అలాగే, సంస్థ సరఫరా వ్యవస్థతో ముడిపడి ఉన్న మరో 20,000 మందిపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. ఒకవేళ డీల్‌ గానీ సాకారమై ఉంటే బ్రిటన్‌లోని వేల్స్‌లో టాటా స్టీల్‌కు చెందిన టాల్బోట్‌ ప్లాంటు విషయంలోనూ కొంత ఆశలు సజీవంగా ఉండేవి. సంక్షోభంలో ఉన్న దీన్ని జర్మనీకి చెందిన థిస్సెన్‌క్రప్‌లో విలీనం చేయాలని టాటా స్టీల్‌ ప్రయత్నించినప్పటికీ.. డీల్‌ కుదరలేదు. 

Advertisement
Advertisement