బైబై బీఎస్‌– 4.. మార్చి 31 వరకే రిజిస్ట్రేషన్‌ | Sakshi
Sakshi News home page

బీఎస్‌– 4.. బైబై

Published Fri, Feb 21 2020 11:29 AM

BS4 Vehicles Registration Stop in march SPSR Nellore - Sakshi

కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారత్‌ స్టేజ్‌–6 వాహనాలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న బీఎస్‌–4 వాహనాల విక్రయాలు నిలిచిపోనున్నాయి. రవాణాశాఖ అధికారులు మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ వాహనాలకురిజిస్ట్రేషన్లు చేయనున్నారు. సుప్రీం ఉత్తర్వుల మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బీఎస్‌–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. దీంతో ఆయా షోరూంల్లో ఉన్న బీఎస్‌–4 వాహనాలను విక్రయించేందుకు, డీలర్లు ప్రయత్నాలుప్రారంభించారు.

నెల్లూరు(టౌన్‌): ప్రస్తుతం జిల్లాలో పలు షోరూంల్లో ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బీఎస్‌–4 వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు తప్పేలా లేదు. ఇప్పటి నుంచి కొనుగోలు చేసిన వాహనాలను తాత్కాలిక, పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాతే వారికి అప్పగించాలని జిల్లా రవాణాశాఖ అధికారులు ఆయా షోరూం డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయకుండా వాహనాన్ని అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కొనుగోలు చేసి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోని వాహనాలను గుర్తించి వెంటనే వాటికి రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశించారు. మార్చి 31వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బీఎస్‌–4 వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేసే పరిస్థితుల్లేవు. వాహన డీలర్లు సైతం నిర్ణీత గడువులోపు తమ షోరూంల్లోని బీఎస్‌–4 వాహనాలను విక్రయిస్తుండంతో పాటు వాటికి రిజిస్ట్రేషన్‌ చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

షోరూం డీలర్లతో సమావేశం నిర్వహిస్తున్న డీటీసీ సుబ్బారావు
ఇక నుంచి వాటికి మాత్రమే..
ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బీఎస్‌–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. ఇప్పటికే బీఎస్‌–4 వాహనాలు ఆయా షోరూంల్లో వందల సంఖ్యలో నిల్వ ఉన్నట్లు తెలిసింది. వాటిని త్వరగా విక్రయించడం లేదా తయారీ కంపెనీలకు అప్పగించడం చేయాల్సి ఉంటుంది. 2017 మార్చి 31తో బీఎస్‌–3 వాహనాలను నిలిపి వేశారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బీఎస్‌–4 వాహనాలను విక్రయించారు. అయితే మార్చి 31వ తేదీ లోపు కొనుగోలు చేసిన బీఎస్‌–3 వాహనాలకు ఏప్రిల్‌ తర్వాత కూడా రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే

ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండదు.రాయితీలు ప్రకటిస్తారా...
గతంలో బీఎస్‌–3 వాహనాలకు గడువు విధించిన సమయంలో ఆయా షోరూం యజమానులు వాహనాల కోనుగోలు కోసం భారీగా రాయితీలు ప్రకటించారు. ఒక్కో వాహనం మీద ధరను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ ఇచ్చారు. అయితే ఈసారి అదే విధంగా రాయితీలు ఇస్తారా లేక నిర్ణయించిన ధరకే అమ్ముతారన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగాల్లో వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. గతంలో రోజుకు అన్ని వాహనాలు కలిపి 350కి పైగా రిజిస్ట్రేషన్‌ అయ్యేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో డీలర్లు డీలా పడిన పరిస్థితి ఉంది.

డీలర్లతో సమావేశం  
రవాణా కార్యాలయంలో గురువారం ఉప రవాణా కమిషనర్‌ సుబ్బారావు జిల్లాలోని ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహన డీలర్లతో సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఇప్పటి నుంచి షోరూంల్లో కొనుగోలు చేసిన బీఎస్‌–4 మోడల్‌కు సంబంధించి ప్రతి వాహనానికి తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్‌ను చేసిన తర్వాతే యజమానులకు అప్పగించాలని తెలిపారు. ఈ ఆదేశాలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. గతంలో విక్రయించి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలను గుర్తించి వాటికి మార్చి 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు.

Advertisement
Advertisement