Sakshi News home page

29,000 పైకి సెన్సెక్స్...

Published Fri, Jan 23 2015 2:04 AM

29,000 పైకి సెన్సెక్స్...

మూడోరోజూ కొత్త రికార్డుల మోత...
* 117 పాయింట్లు అప్, 29,006 వద్ద క్లోజ్
* 31 పాయింట్లు పెరిగి.. 8,761కి చేరిన నిఫ్టీ
* ఈసీబీ ప్యాకేజీ, బడ్జెట్‌పై ఆశలు...

మార్కెట్  అప్‌డేట్
విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం పోటెత్తుతుండటంతో... దేశీ స్టాక్ మార్కెట్లు చెంగుచెంగున దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడో రోజూ కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు ఎగబాకాయి. చరిత్రలో తొలిసారిగా గురువారం సెన్సెక్స్ 29,000 పాయింట్లపైకి చేరడమే కాకుండా.. ఇదే స్థాయిపైన ముగియడం గమనార్హం. ప్రధానంగా మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న యూరప్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చేందుకు అక్కడి సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించనుందన్న వార్తలు(మన మార్కెట్ ముగిశాక ఈసీబీ ప్యాకేజీ ప్రకటన వెలువడింది) మార్కెట్లను ఉరకెత్తించాయి.ఈ సహాయ ప్యాకేజీ నిధులు భారత్‌తో పాటు వర్ధమాన దేశాల మార్కెట్లలోకి వెల్లువెత్తుతాయన్న అంచనాలే దీనికి కారణం. దీంతోపాటు వచ్చే నెల 28న మోదీ సర్కారు ప్రవేశపెట్టనున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై పెరుగుతున్న ఆశావహధోరణి కూడా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పెరిగేలా చేస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
 
6 రోజుల్లో 6 శాతం అప్.:
గురువారం ట్రేడింగ్‌లో 69 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 28,957 వద్ద మొదలైన్ సెన్సెక్స్ ఆతర్వాత మరింత దూకుడు ప్రదర్శించింది. ఒకానొక దశలో 29,060 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు క్రితం ముగింపు 28,889తో పోలిస్తే... 117 పాయింట్లు లాభపడి 29,006 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా మరో 31 పాయింట్లు ఎగబాకి 8,761 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 8,774 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. కాగా, వరుసగా మూడోరోజు సెన్సెక్స్, నిఫ్టీలు అటు ఇంట్రాడే, ఇటు క్లోజింగ్‌లో రెండువిధాలుగానూ కొత్త రికార్డులను నెలకొల్పడం విశేషం. అంతేకాకుండా... గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,659 పాయింట్లు(6.07%) దూసుకెళ్లడం గమనార్హం.

Advertisement
Advertisement