బీఎస్‌ఈలో 200 కంపెనీల డీలిస్టింగ్‌ | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఈలో 200 కంపెనీల డీలిస్టింగ్‌

Published Tue, Aug 22 2017 12:24 AM

బీఎస్‌ఈలో 200 కంపెనీల డీలిస్టింగ్‌

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ బీఎస్‌ ఈ ఈ నెల 23 నుంచి 200 కంపెనీలను తప్పనిసరి డీలిస్ట్‌ చేయనుంది. అంతేకాదు ఈ కంపెనీల ప్రమోటర్లను మార్కెట్‌లో పాల్గొనకుండా నిషేధం విధించనుంది. డీలిస్ట్‌ కాబోయే కంపెనీల ప్రమోటర్లు ప్రజల వద్దనున్న వాటాలను స్వతంత్ర వ్యాల్యూయర్‌ ఖరారు చేసిన ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని బీఎస్‌ఈ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

డీలిస్ట్‌ కానున్న 200 కంపెనీల్లో 117 కంపెనీలు పదేళ్లకు పైగా సస్పెండ్‌లో ఉన్నవే. 28 స్టాక్స్‌ సైతం పదేళ్లుగా సస్పెన్షన్‌లోనే ఉన్నప్పటికీ లిక్విడేషన్‌లో ఉన్నాయి. వీటితోపాటు మరో 55 కంపెనీల షేర్లు కూడా డీలిస్ట్‌ అవుతాయి. డీలిస్ట్‌ కానున్న కంపెనీల్లో యూఫార్మా లేబరేటరీస్, అథెనా ఫైనాన్షియల్‌ సర్వీసెస్, మాగ్నస్‌ రబ్బర్‌ ఇండస్ట్రీస్, రాజస్థాన్‌ పాలిస్టర్స్, ట్రాన్స్‌పవర్‌ ఇంజనీరింగ్, డ్యుపాంట్‌ స్పోర్ట్స్‌ వేర్, డైనవోక్స్‌ ఇండస్ట్రీస్, జీడీఆర్‌ మీడియా ఉన్నా యి.

షెల్‌ కంపెనీలపై సెబీ, స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు చర్య లు చేపడుతున్న తరుణంలోనే ఈ కంపెనీలను డీలిస్ట్‌ చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 331 అనుమానిత షెల్‌ కంపెనీల్లో ట్రేడింగ్‌ పరంగా ఆంక్షలకు సెబీ ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. వీటిలో సుమారు పది కంపెనీల వరకు శాట్‌కు వెళ్లి సెబీ ఆదేశాలపై స్టే ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. 

Advertisement
Advertisement