కదం తొక్కిన బుల్‌- 37000 దాటిన సెన్సెక్స్‌ | Sakshi
Sakshi News home page

బుల్‌ జోరు- మార్కెట్ల హైజంప్‌

Published Fri, Jul 17 2020 3:55 PM

Bull speed -Sensex crosses 37000 points mark - Sakshi

చివరి గంటలో బుల్‌ ఆపరేటర్లు కదం తొక్కడంతో మార్కెట్లు హైజంప్‌ చేశాయి. వెరసి సెన్సెక్స్‌ 37,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 548 పాయింట్లు జమ చేసుకున్న సెన్సెక్స్‌ 37,020 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ 162 పాయింట్లు ఎగసి 10,902 వద్ద స్థిరపడింది. వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా 36,548 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌  చివర్లో 37,126కు చేరింది. మధ్యలో 36,513 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10,933 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరగా.. 10,750 వద్ద కనిష్టాన్ని నమోదు చేసుకుంది. 

ఐటీ మినహా..
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ(0.6 శాతం) మినహా అన్ని రంగాలూ 1.7-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో, మెటల్‌ 1.7 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌ 12.5 శాతం జంప్‌చేయగా.. ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ 6-3.3 శాతం మధ్య ఎగశాయి. అయితే హిందాల్కో, బ్రిటానియా, నెస్లే, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

ఐడియా జోరు
వొడాఫోన్‌ ఐడియాకు అనుకూలంగా ట్రాయ్‌కు టీడీశాట్‌ ఆదేశాలు జారీ చేసిన వార్తలతో ఈ కౌంటర్‌ 14 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో ఇతర డెరివేటివ్‌ షేర్లు హెచ్‌పీసీఎల్‌, ముత్తూట్‌, టాటా పవర్‌, ఎన్‌ఎండీసీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, వోల్టాస్‌, అపోలో హాస్పిటల్స్‌ 7-5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఉజ్జీవన్‌, చోళమండలం, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, పీవీఆర్‌, మెక్‌డోవెల్‌ 1.4-0.7 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.6-1.2 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1653 లాభపడగా.. 989 మాత్రమే నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1091 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1660 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 222 కోట్లు, డీఐఐలు రూ. 899 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇక మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1566 కోట్లు, డీఐఐలు రూ. 650 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి.

Advertisement
Advertisement