కెయిర్న్ ఇండియా లాభం 18% వృద్ధి | Sakshi
Sakshi News home page

కెయిర్న్ ఇండియా లాభం 18% వృద్ధి

Published Thu, Apr 24 2014 1:18 AM

కెయిర్న్ ఇండియా లాభం 18% వృద్ధి

 న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4) కాలానికి కెయిర్న్ ఇండియా రూ. 3,035 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 2,564 కోట్లతో పోలిస్తే ఇది 18% వృద్ధి. ఇదే కాలానికి అమ్మకాలు కూడా 16% పెరిగి రూ. 5,049 కోట్లకు చేరాయి. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6.50 తుది డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కాలంలో రాజస్తాన్‌తోపాటు మరో రెండు ఇతర ఆయిల్ క్షేత్రాల నుంచి సగటున రోజుకి 2,24,429 బ్యారళ్లను ఉత్పత్తి చేసింది. ఇది 11% అధికం. విడిగా రాజస్తాన్ క్షేత్రాల నుంచి ఉత్పత్తి 12% పుంజుకుని రోజుకి 1,89,304 బ్యారళ్లకు చేరింది.

 అదనపు నిల్వలు జత
  నాలుగేళ్ల విరామం తరువాత గతేడాది బార్మర్ బేసిన్‌లో వెలికితీత కార్యక్రమాలను మొదలుపెట్టడంతో ఈ ఏడాది 1 బిలియన్ బ్యారళ్ల చమురు నిల్వలను సమకూర్చుకోగలిగినట్లు కంపెనీ  సీఈవో ఎలాంగో.పి చెప్పారు. ఇవి ప్రస్తుత 4.2 బ్యారళ్లకు అదనంకాగా, కంపెనీ వద్ద నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 13,707 కోట్లకు చేరింది.

 నిధులను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ చెల్లింపు తదితరాలకు వినియోగించే అవకాశముంది. మార్చి నెలలో సగటున రోజుకి 2,00,000 బ్యారళ్ల ఉత్పత్తిని సాధించడమేకాకుండా, క్యూ4లో 20 కోట్ల బ్యారళ్ల ఆయిల్‌ను ఉత్పత్తి చేయగలిగినట్లు వివరించారు. ఇక పూర్తి ఏడాదికి(2013-14) కంపెనీ నికర లాభం 4%పైగా పెరిగి రూ. 12,432 కోట్లకు చేరగా, అమ్మకాలు రూ. 17,524 కోట్ల నుంచి రూ. 18,762 కోట్లకు ఎగశాయి.
 ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కెయిర్న్ షేరు 3.3% తగ్గి రూ. 352 వద్ద ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement