ఈ రేటింగ్‌లను పట్టించుకోవాలా? | Sakshi
Sakshi News home page

ఈ రేటింగ్‌లను పట్టించుకోవాలా?

Published Fri, May 12 2017 12:24 AM

ఈ రేటింగ్‌లను పట్టించుకోవాలా?

►  ఏజెన్సీలు చైనాపై ఒకలా, మనపై ఒకలా వ్యవహరిస్తున్నాయి
►  ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌ విమర్శ


బెంగళూరు: భారత్‌ రేటింగ్‌ పెంచే విషయంలో అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు అనుసరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేటింగ్‌కు సంబంధించి భారత్‌ విషయంలో ఒకలా చైనా విషయంలో మరోలా వ్యవహరిస్తున్నాయని, అసంబద్ధ ప్రమాణాలు పాటిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక మూలాలు మెరుగుపడినప్పటికీ భారత్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం లేదని ఆక్షేపించారు.

‘ఇటీవలి కాలంలో భారత ఆర్థిక పరిస్థితులు (ద్రవ్యోల్బణం, వృద్ధి, కరెంటు ఖాతా లోటు మొదలైనవి) మెరుగుపడటం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. రేటింగ్‌ ఏజెన్సీలు మాత్రం బిబిబి మైనస్‌ రేటింగ్‌నే కొనసాగిస్తున్నాయి. కానీ ఫండమెంటల్స్‌ మరింత దిగజారినప్పటికీ.. చైనా రేటింగ్‌ను ఎఎ మైనస్‌ స్థాయికి పెంచాయి. మరో మాటలో చెప్పాలంటే భారత్, చైనా విషయంలో రేటింగ్‌ ఏజెన్సీలు అసంబద్ధ ప్రమాణాలు పాటిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ రేటింగ్‌ ఇచ్చే అనలిస్టుల అభిప్రాయాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నదే నా ప్రశ్న‘ అని  అరవింద్‌ పేర్కొన్నారు. వీకేఆర్‌వీ స్మారకోపన్యాసం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రేటింగ్‌ దిగజారితే వడ్డీ పెరుగుతుంది!!
రేటింగ్‌ ఏజెన్సీలు .. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన గ్రేడ్స్‌లో భారత్‌కు అతి తక్కువ రేటింగ్‌ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి రేటింగ్స్‌ గల దేశాల్లో ఇన్వెస్ట్‌ చేయడంలో అధిక రిస్కులు ఉన్నాయని ఇన్వెస్టర్లు భావించడం వల్ల .. ఆయా దేశాలు ప్రపంచ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించాల్సి వచ్చినప్పుడు మరింత ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలోనే భారత్‌కి రేటింగ్‌ ఇచ్చే విషయంలో ఏజెన్సీలు వ్యవహరిస్తున్న తీరును గతంలో కూడా కేంద్రం ఆక్షేపించింది. వృద్ధి మందగిస్తూ, రుణభారం పెరుగుతున్న చైనాకు ఎఎ మైనస్‌ రేటింగ్‌ను కొనసాగించిన ఎస్‌అండ్‌పీ సంస్థ భారత గ్రేడ్‌ను మాత్రం జంక్‌ స్థాయి కన్నా కేవలం ఒక అంచె ఎక్కువలో ఉంచడాన్ని ప్రశ్నించింది. అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు వాస్తవ పరిస్థితులను పరిశీలించడం లేదంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ సైతం గత వారం వ్యాఖ్యానించారు.

సబ్‌ప్రైమ్‌ సంక్షోభమే ఉదాహరణ..
రేటింగ్‌ ఏజెన్సీలు పాటిస్తున్న అసంబద్ధ విధానాలకు సబ్‌ ప్రైమ్‌ సంక్షోభం నాటి పరిస్థితులే ఉదాహరణని  అరవింద్‌ పేర్కొన్నారు. ఎందుకూ కొరగాని తనఖా రుణ పత్రాలకు రేటింగ్‌ ఏజెన్సీలు ట్రిపుల్‌ ఎ రేటింగ్‌ ఇవ్వడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి హెచ్చరించడంలో విఫలమైన రేటింగ్‌ ఏజెన్సీల సమర్ధతపైనా సందేహాలు రేకెత్తాయని వ్యాఖ్యానించారు.
 

Advertisement
Advertisement