హైఎండ్ ఫోన్లపై సెల్ కాన్ దృష్టి | Sakshi
Sakshi News home page

హైఎండ్ ఫోన్లపై సెల్ కాన్ దృష్టి

Published Wed, Jul 16 2014 3:06 AM

హైఎండ్ ఫోన్లపై సెల్ కాన్ దృష్టి - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు లోకాస్ట్ ఫోన్ల తయారీలో పేరొందిన సెల్‌కాన్ ఇకనుంచి హైఎండ్ స్మార్ట్‌ఫోన్లపై దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మిలీనియం సిరీస్ పేరుతో రెండు కొత్త మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కె.టి.రామారావు ఈ ఫోన్లను ఆవిష్కరించారు.

 ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 3జీ వీడియో కాలింగ్, 9.9 మి.మీ మందంతో ఆకర్షణీయంగా క్యూ 470, క్యూ 3000 మోడల్స్‌ను తీర్చిదిద్దడమే కాకుండా  తక్కువ ధరకే అందిస్తున్నట్లు సెల్‌కాన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వై.గురు తెలిపారు. క్యూ 470 ధరను రూ.11,999, క్యూ 3000 ధర రూ. 8,999గా నిర్ణయించారు. అన్ని అప్లికేషన్లు పనిచేస్తున్నా రెండు రోజులు వచ్చే విధంగా  శక్తివంతమైన 3,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు మోడల్స్ ఆన్‌లైన్ పోర్టల్ స్నాప్‌డీల్‌లో మాత్రమే లభించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సెల్‌కాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.మురళి తెలిపారు.

ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత గురు మీడియాతో మాట్లాడుతూ లోఎండ్ మార్కెట్లో సెల్‌కాన్ బ్రాండ్ స్థిరపడటంతో ఇక నుంచి హైఎండ్ స్మార్ట్ ఫోన్లపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో రూ.5,000 నుంచి రూ.15,000 ధరల శ్రేణిలో 10 స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నామన్నారు. ఇందులో 8 మిలీనియం, రెండు క్యాంపస్ సిరీస్‌లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త మోడల్స్‌ను వివిధ నగరాల్లో బ్రాండ్ అంబాసిడర్ తమన్నా చేతులు మీదుగా విడుదల చేసేట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.

 త్వరలోనే 4జీ సేవలు
 త్వరలో తెలంగాణా రాష్ట్రంలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు కె.రామారావు ప్రకటించారు. ఈ దిశగా కంపెనీలు, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, దీపావళికల్లా 4జీ సేవలు అందుబాటులోకి రావచ్చన్నారు. 4జీ సేవలు అందుబాటులోకి వస్తుండటంతో ఈ విభాగంపై దృష్టిసారించాల్సిందిగా సెల్‌కాన్‌ని కోరారు. దీనిపై గురు స్పందిస్తూ సెల్‌కాన్‌తోనే 4జీ సేవలు ప్రారంభిస్తామని, దీనికి ఇప్పటి నుంచే మా ఆర్‌అండ్‌డీ బృందం పనిచేస్తుందని హామినిచ్చారు.

Advertisement
Advertisement