బ్యాంకింగ్‌కు బూస్ట్‌... క్రెడిట్‌ పాజిటివ్‌! | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌కు బూస్ట్‌... క్రెడిట్‌ పాజిటివ్‌!

Published Thu, Oct 26 2017 12:18 AM

Center's banking capital decision ensures India's financial prospects

న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారంతో సతమతమవుతున్న బ్యాంకింగ్‌ రంగానికి ఊతమిచ్చే క్రమంలో రెండేళ్లలో రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వాలన్న కేంద్ర ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బ్యాంకింగ్‌కు శుభపరిణామమని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ– మూడీస్‌ సహా పలు బ్యాంకింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు పేర్కొన్నాయి. ‘ఇది ప్రాధాన్యత కలిగిన క్రెడిట్‌ పాజిటివ్‌ చర్య’ అని మూడీస్‌  విశ్లేషించింది. మూలధనానికి సంబంధించి ఈ నిర్ణయం కీలకమని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ వైస్‌ ప్రెసిడెంట్, సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ వడ్లమాని పేర్కొన్నారు. రూ.1.35 లక్షల కోట్లను బాండ్ల రీక్యాపిటలైజేషన్, మిగిలిన రూ.76,000 కోట్లు బడ్జెట్‌ మద్దతు ద్వారా అందించాలని కేంద్రం మంగళవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఆర్థిక వ్యవస్థకు ఊతం: గోల్డ్‌మన్‌ శాక్స్‌
బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ విశ్లేషించింది. సమీప కాలంలో ఈక్విటీలకూ, విదేశీ మారక విలువలో రూపాయి బలపడ్డానికీ తాజా చర్య ఉపయోగపడుతుందని పేర్కొంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం కన్నా 36 పైసలు బలపడి 64.82 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్‌ రుణ పురోగతి, పెట్టుబడుల పురోగతి, జీడీపీ వృద్ధికి తాజా నిర్ణయం దోహదపడుతుందని విశ్లేషించింది. బ్యాంకింగ్‌కు ప్రతి రూ.10,000 కోట్ల మూలధన పెంపూ–  జీడీపీ ఒక శాతం, రుణ వృద్ధి అరశాతం మెరుగుదలకు దోహదపడుతుందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనావేసింది. అయితే రీక్యాపిటలైజేషన్‌లో జరిగే ఆలస్యం, ఇతర బ్యాంకింగ్‌ సంస్కరణలు కీలకమైనవని వివరించింది.

ఆర్థిక రికవరీకి తప్పదు: బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా
ఆర్థిక రికవరీకి బ్యాంకింగ్‌కు భారీ మూలధనం అందించక తప్పదని మరో అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా– మెరిలించ్‌ (బీఓఎఫ్‌ఏఎంఎల్‌) పరిశోధనా నివేదిక ఒకటి తేల్చింది. ఈ దిశలో మంగళవారం తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైనదిగా పేర్కొంది. రుణ వృద్ధికి తద్వారా ఆర్థికాభివృద్ధికి తాజా నిర్ణయం దోహదపడుతుందని నివేదికలో పేర్కొంది. ‘’ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వడ్డీరేట్లు తగ్గే వీలుంది. దీనితో డిమాండ్‌ పెరుగుతుంది. కర్మాగారాలు మళ్లీ పనిలో పడతాయి. రెండుమూడేళ్లలో పెట్టుబడులు మెరుగుపడతాయి’’ అని నివేదిక పేర్కొంది. తాజా నిధులతో బ్యాంకులు తమ బ్యాలెన్స్‌ షీట్లను మెరుగుపరుచుకుంటాయని, తగిన మూలధన అవసరాలను నెరవేర్చుకుంటాయని విశ్లేషించింది.  

ఉపాధి అవకాశాలు పెరుగుతాయ్‌: ఎస్‌బీఐ రిసెర్చ్‌
తాజా ప్రభుత్వ నిర్ణయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ వివరించింది. రుణ వృద్ధి, ఉపాధి కల్పనకు మద్దతునిచ్చేగొప్ప బ్యాంకింగ్‌ సంస్కరణ ఇదని విశ్లేషించింది. బాండ్ల ద్వారా రీక్యాపిటలైజేషన్‌ బ్యాంకులకు ఆర్థికంగా ఇబ్బందికరమని వస్తున్న విశ్లేషణలను ఎస్‌బీఐ రిసెర్చ్‌ తోసిపుచ్చింది.

5 నుంచి 7 పెద్ద బ్యాంకులు చాలు: సీఈఏ
భారత్‌ బ్యాంకింగ్‌ రంగంలో విలీనపర్వం సంకేతాలను ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్‌ సుబ్రమణ్యం ఇచ్చారు. దేశానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి 5–7 పెద్ద బ్యాంకులు చాలన్నారు. బ్యాంకింగ్‌కు రెండేళ్లలో రూ.2 లక్షలకు పైగా నిధుల కల్పనకు కేంద్రం ప్రకటించిన రెండవరోజే సుబ్రమణ్యం చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాలో ప్రస్తుతం ఉన్న 3–4 బ్యాంకులు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా నిలుస్తున్నాయని చెప్పారు.  రీక్యాపిటలైజేషన్‌ బ్యాండ్లవల్ల ప్రభుత్వంపై వార్షికంగా రూ.9,000 కోట్ల వడ్డీ భారం పడుతుందని అరవింద్‌ సుబ్రమణ్యం పేర్కొన్నారు.

చారిత్రక ముందడుగు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌
కేంద్రం బ్యాంకింగ్‌ మూలధన నిర్ణయం భారత్‌ ఆర్థిక భవితకు భరోసా ఇస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఇది చారిత్రక ముందడుగని అభివర్ణించారు. బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో సమగ్ర పాలసీ అని సైతం కేంద్ర నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. దేశ స్థిర వృద్ధికి దోహదపడుతుందన్నారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ పురోగతికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడానికి ప్రభుత్వంతో ఆర్‌బీఐ కలిసి పనిచేస్తుందని అన్నారు.  

Advertisement
Advertisement