విమాన బోర్డింగ్‌లో మార్పులు! | Sakshi
Sakshi News home page

విమాన బోర్డింగ్‌లో మార్పులు!

Published Tue, Nov 20 2018 1:10 AM

Changes in flight boarding! - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: త్వరలోనే విమానాల్లో బోర్డింగ్‌ పద్ధతి మారనుంది. ఇప్పటివరకు విమానాల్లో బోర్డింగ్‌ సీట్‌ నంబర్ల ఆధారంగా వరుస క్రమంలో ఉండేది. కానీ, మున్ముందు దీని స్థానంలో విమానంలో కిటికీ దగ్గర సీటు ప్రయాణికులు ముందు, ఆ తర్వాత మధ్య సీటు వారు, ఆ తర్వాత చివరి సీటు ప్రయాణికులు ఎక్కే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ విధానంలో విమానాల బోర్డింగ్‌ సమయం 35 శాతం వరకు తగ్గుతుందనేది నిపుణుల మాట.

‘‘అమెరికాలోని సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ విధానాన్నే పాటిస్తోంది. బోర్డింగ్‌ సమయాన్ని 10 ని.లకు తగ్గించి కంపెనీ లాభాల బాట పట్టింది’’ అని గ్రీన్‌టెక్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారని, త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని విమానాశ్రయ భద్రత నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌టెక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ’పై జరుగుతున్న రెండు రోజుల జాతీయ సదస్సులో పలువురు వక్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ హెడ్‌ సేఫ్టీ తారీక్‌ కమల్‌ ఏమన్నారంటే..

విమానం గాల్లో ఉంటేనే లాభం..
విమానంలో గాల్లో ఉంటేనే డబ్బులు. బోర్డింగ్‌ కోసం సమయాన్ని వృథా చేస్తే కంపెనీకే నష్టం. విమానయాన కంపెనీలకు సమయం అనేది చాలా కీలకం. బోర్డింగ్, టేకాఫ్‌ ఎంత త్వరగా జరిగితే విమాన కంపెనీలకు అంత లాభం. విమానం ల్యాండింగ్‌ కాగానే వివిధ రకాల గ్రూప్‌లు, ఏజెన్సీల బాధ్యత ఉంటుంది.

ప్రయాణికుల బోర్డింగ్‌ పాస్, చెకిన్, క్యూ, లగేజ్, కార్గో, ఇంధనం, ఆహారం, క్లీనింగ్, క్రూ, పైలెట్‌ ఎంట్రీ వంటివి ఉంటాయి. ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరిగిపోవాలి. బోర్డింగ్‌ సమయాన్ని తగ్గిస్తే.. నిర్వహణ వ్యయం తగ్గి విమాన కంపెనీ లాభాలు 0.43 శాతం పెరుగుతాయి. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలో ఒక్క విమానం... ప్రయాణికులందరు ఎక్కి.. రన్‌వే మీదుగా టేకాఫ్‌ కావడానికి కనీసం 27 నిమిషాల సమయం పడుతోంది.  

విమానాశ్రయ కో–ఫౌండర్‌ టైంకి రాలేదని టేకాఫ్‌..
విమాన ల్యాండింగ్, టేకాఫ్‌లో కచ్చితమైన సమయపాలన పాటించడంతో ప్రపంచ విమానాశ్రయ పరిశ్రమలోనే సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ది అగ్రస్థానం. ఏ ప్రముఖుల కోసం సౌత్‌ వెస్ట్‌ విమానాలు ఆగవు. ఒకసారి సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ కో–ఫౌండర్, మాజీ చైర్మన్‌ హెర్బ్‌ కెల్హర్‌ సమయానికి బోర్డింగ్‌ కాలేదు. ఆయన్ను గేట్‌ వద్దే వదిలేసి విమానం టేకాఫ్‌ అయింది. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభంలో 4 విమానాలుండేవి. నిర్వహణ భారంతో ఒకటి విక్రయించింది. దీంతో ఉద్యోగులు బోర్డింగ్‌ సమయాన్ని తగ్గించి.. నాలుగో విమాన రూట్‌ని కూడా 3 విమానాలతో నడిపించగలిగే స్థాయికి తీసుకురాగలిగారు.

Advertisement
Advertisement