విస్తరణ బాటలో చర్మాస్.. | Sakshi
Sakshi News home page

విస్తరణ బాటలో చర్మాస్..

Published Fri, Jul 10 2015 12:11 AM

విస్తరణ బాటలో చర్మాస్..

ఆరు కిలోమీటర్లకో ఔట్‌లెట్
♦ ఏటా 1-2 షోరూంలు ప్రారంభిస్తాం
♦ చర్మాస్ గ్రూప్ ప్రెసిడెంట్ పెస్తోంజి
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రెడీమేడ్ దుస్తుల వ్యాపారంలో ఉన్న చర్మాస్ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో మొత్తం ఏడు షోరూంలను నిర్వహిస్తున్న ఈ సంస్థ 8వ ఔట్‌లెట్‌ను కొండాపూర్‌లో సిటీ క్యాపిటల్ మాల్‌లో ఏర్పాటు చేస్తోంది. భాగ్యనగరంతోపాటు ప్రధాన నగరాల్లో మరిన్ని షోరూంలు తెరువనుంది. ఏ కస్టమర్‌కైనా కనీసం ఆరు కిలోమీటర్లలోపే అందుబాటులో స్టోర్ ఉండాలన్నది తమ ధ్యేయమని చర్మాస్ గ్రూప్ చైర్మన్ కె.ఎఫ్.పెస్తోంజి గురువారం తెలిపారు. ఏటా 1-2 ఔట్‌లెట్లు తెరుస్తామన్నారు. చర్మాస్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డెరైక్టర్లు గుల్ కె పెస్తోంజి, కైజద్ పెస్తోంజితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

 ఈ ఏడాది సైతం..: చర్మాస్ 300లకుపైగా బ్రాండ్ల దుస్తులను విక్రయిస్తోంది. భారత్‌లో టాప్-5 రిటైల్ సంస్థగా నిలిచింది. గతేడాది రిటైల్ ద్వారా రూ.120 కోట్ల ఆదాయం ఆర్జించింది. రెడీమేడ్ దుస్తుల మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో ఆదాయం ఆర్జిస్తామన్న ధీమాను కె.ఎఫ్.పెస్తోంజి వ్యక్తం చేశారు. కంపెనీ జీడిమెట్ల సమీపంలోని ప్లాంటులో నెలకు 1.50 లక్షల పీసుల దుస్తులను తయారు చేస్తోంది. ఇతర కంపెనీలకూ దుస్తులను సరఫరా చేస్తోంది. జాబ్ వర్క్ ద్వారా గతేడాది రూ.25 కోట్లు సమకూరింది.

 ఆన్‌లైన్‌లోకి చర్మాస్..
 ఆన్‌లైన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి కంపెనీలతో చర్చిస్తున్నట్టు కైజద్ పెస్తోంజి తెలిపారు. ‘2016కల్లా తొలుత మార్కెట్ ప్లేస్ ద్వారా ఈ-కామర్స్‌లోకి వస్తాం. 2017లో సొంతంగా వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తాం. దుస్తుల విపణిలో ఆన్‌లైన్ వాటా కేవలం 2 శాతం మాత్రమే. భవిష్యత్తులో ఇది 8-10 శాతానికే పరిమితమవుతుంది. దీనికి కారణం ఇప్పటికీ కస్టమర్లు టచ్ అండ్ ఫీల్ కోరుకుంటున్నారు’ అని చెప్పారు.

 రూ. 5 కోట్ల విలువైన బహుమతులు..
 కంపెనీ ఏర్పాటై 35 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా జూలై 10 నుంచి దీపావళి వరకు ప్రత్యేక స్కీంను ఆఫర్ చేస్తోంది. ప్రతి రూ.1,800ల కొనుగోలుపై కస్టమర్‌కు ఒక స్క్రాచ్ కార్డు ఇస్తారు. రూ.100 మొదలుకొని రూ.10 లక్షల వరకు కచ్చితమైన నగదు బహుమతిని వెంటనే పొందవచ్చు. మొత్తం రూ.5 కోట్లకుపైగా విలువైన నగదు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వంటి బహుమతులు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement