అవినీతి కేసులో చిదంబరానికి సీబీఐ సమన్లు

1 Jun, 2018 19:02 IST|Sakshi
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రశ్నించేందుకు మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరంకు సీబీఐ సమన్లు జారీ చేసింది. జూన్‌ 6న విచారణకు హాజరు కావల్సిందిగా చిదంబరంను దర్యాప్తు సంస్థ కోరింది. అవినీతి కేసులో చిదంబరంను జులై 3వరకూ అరెస్ట్‌ చేయరాదని సీబీఐకి గురువారం కోర్టు సూచించిన సంగతి తెలిసిందే.

ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో 2007లో విదేశీ పెట్టుబడులకు ఆమోదం లభించడంలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రపై ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసింది. కాగా, ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుల్లో అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు చిదంబరం బుధవారం ఢిల్లీలో రెండు న్యాయస్ధానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జూన్‌ 5న తదుపరి విచారణ జరిగే వరకూ చిదంబరంను అరెస్ట్‌ చేయరాదని వీటిలో ఓ న్యాయస్ధానం దర్యాప్తు సంస్థ ఈడీని ఆదేశించింది.  

ఇక ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఫిబ్రవరి 28న అరెస్ట్‌ అయిన చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సంస్థకు విదేశీ పెట్టుబడుల కోసం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం లభించేలా ముడుపులు అందుకుని సహకరించారని కార్తీ చిదంబరంపై ఆరోపణలున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు