చైనా వృద్ధి లక్ష్యం 7 శాతానికి తగ్గింపు | Sakshi
Sakshi News home page

చైనా వృద్ధి లక్ష్యం 7 శాతానికి తగ్గింపు

Published Fri, Mar 6 2015 1:00 AM

చైనా వృద్ధి లక్ష్యం 7 శాతానికి తగ్గింపు

బీజింగ్: చైనా ప్రస్తుత సంవత్సరం (2015) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు లక్ష్యాన్ని 7 శాతంగా నిర్దేశించుకుంది. గత ఏడాది చైనా వృద్ధి లక్ష్యం 7.5 శాతం. అయితే 7.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇంత కనిష్ట స్థాయి వృద్ధి నమోదుకావడం 24 సంవత్సరాల్లో తొలిసారి. గతేడాది వృద్ధి రేటుతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం చైనా లక్ష్యం ప్రకారం రేటు మరింత త గ్గనుంది. చైనా పార్లమెంటు  వార్షిక  సమావేశం సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధాని లీ కిక్వైంగ్ 7 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని ప్రకటిస్తూ  దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అంశాలను ప్రస్తావించారు.

బొగ్గు వంటి కాలుష్య కారక ఇంధన వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, డిమాండ్ పెంపునకు చర్యలు అవసరమని అన్నారు. జనవరిలో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ట స్థాయి 0.8 శాతానికి పడిపోయింది. 2014 మొత్తంలో ద్రవ్యోల్బణం 3.5 శాతం ఉండగా, 2015లో ఇది కనీసం 3 శాతం స్థాయిలో ఉండాలని చైనా భావిస్తోంది. ఆయా అంశాలతో పాటు కోటి ఉద్యోగ అవకాశాల కల్పనను కూడా చైనా లక్ష్యంగా పెట్టుకుంది. చైనా వృద్ధి రేటు 2015లో 6.8 శాతానికి  పడిపోతుందని, 2016లో ఇది భారత్ వృద్ధి రేటు 6.5 శాతం కన్నా దిగువకు అంటే  6.3 శాతానికి పడిపోతుందని ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement