మళ్లీ ‘రికార్డ్‌’లు | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘రికార్డ్‌’లు

Published Sat, Dec 23 2017 2:05 AM

Christmas Cheer On Dalal Street, Nifty Hits 10500 For First Time - Sakshi

ముంబై: క్రిస్మస్‌ సంబరాలు స్టాక్‌ మార్కెట్లో ప్రతిఫలిస్తున్నాయి. స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ మరోసారి జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. ఆయిల్, టెక్నాలజీ, బ్యాంకింగ్, క్యాపిటల్‌ గూడ్స్, ఆర్థిక రంగ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో నిఫ్టీ తొలిసారిగా 10,500 పాయింట్లను దాటింది.   బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 184 పాయింట్ల లాభంతో 33,940 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 10,493 పాయింట్ల వద్ద ముగిశాయి.  ఇక వారం పరంగా చూస్తే, వరుసగా మూడో వారంలోనూ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్‌ 477 పాయింట్లు(1.42 శాతం), నిఫ్టీ 160 పాయింట్లు(1.54 శాతం) చొప్పున లాభపడ్డాయి.  

రోజంతా లాభాలే...
బీఎస్‌ఈ సెన్సెక్స్‌  33,768 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే ట్రేడైంది. కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 208 పాయింట్ల లాభంతో 33,964 పాయింట్ల గరిష్ట స్థాయికి, నిఫ్టీ 61  పాయింట్ల లాభంతో 10,501 పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇవి ఈ స్టాక్‌ సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు(ఇంట్రాడేలో)

ఫలితాలపై ఆశావహ అంచనాలు..
కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించే అమెరికా పన్ను సంస్కరణల బిల్లు ఆమోదం పొందడం, అమెరికా క్యూ3 జీడీపీ గణాంకాలు పటిష్టంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లు ర్యాలీ జరిపాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఇది మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించిందని వివరించారు. రానున్న బడ్జెట్‌ మంచిగా ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా బాగానే ఉంటాయన్న ఆశావహ అంచనాలు ర్యాలీని నడిపించాయని పేర్కొన్నారు.  డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం కూడా కలసివచ్చింది.  

 సోమవారం సెలవు  
క్రిస్మస్‌ సందర్భంగా సోమవారం (ఈ నెల 25న) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు.  బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement