5,500 ఉద్యోగాలకు సిస్కో కోత | Sakshi
Sakshi News home page

5,500 ఉద్యోగాలకు సిస్కో కోత

Published Fri, Aug 19 2016 1:29 AM

5,500 ఉద్యోగాలకు సిస్కో కోత

భారత్‌పైనా ప్రభావం!
దేశంలో సంస్థకు 11వేల మంది ఉద్యోగులు

న్యూయార్క్: అమెరికాకు చెందిన నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో భారీగా ఉద్యోగులను తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 5,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ సంఖ్య సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 7 శాతానికి సమానం. ఈ ప్రభావం భారత్‌లోని సంస్థ ఉద్యోగులపైనా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే సిస్కోకు భారత్‌కు రెండో అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఇక్కడ సంస్థకు 11,000 మంది ఉద్యోగులున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 73వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎంత మందిని తొలగించనున్నదీ సిస్కో వెల్లడించలేదు. కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కారణంగా 5,500 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని, 2017 మొదటి త్రైమాసికం నుంచి తొలగింపు ప్రక్రియ చేపడతామని సిస్కో ఎగ్జిక్యూటివ్‌వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్‌వో కెల్లీక్రామర్ తెలిపారు. నెట్‌వర్క్ స్విచెస్, రూటర్ల విక్రయాలు నిదానించడంతో సిస్కో డేటా అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్, డేటా సెంటర్లకు క్లౌడ్ ఆధారిత టూల్స్ అందించే నూతన వ్యాపార విభాగాలపై దృష్టి కేంద్రీకరించింది.

 సిస్కోకు భారత్ కీలకం...
2016 జూన్ త్రైమాసికంలో సిస్కో ఆదాయాలు 2 శాతం తగ్గి 12.6 బిలియన్ డాలర్లకు పడిపోగా... లాభం మాత్రం 21 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖ్యంగా ఇతర వర్ధమాన దేశాల నుంచి ఆదాయాలు 6 శాతం తగ్గిన పరిస్థితుల్లోనూ భారత్ నుంచి కంపెనీ ఆదాయాలు 20 శాతం వృద్ధి చెందడం విశేషం.

Advertisement
Advertisement