పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు | Sakshi
Sakshi News home page

పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు

Published Thu, Jun 15 2017 12:10 AM

పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు - Sakshi

స్వల్పలాభాలతో ముగింపు
ఫెడ్‌ నిర్ణయం కోసం ఎదురుచూపు


ముంబై: భారత్‌ కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగరూకత వహించడంతో స్టాక్‌ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 150 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 52 పాయింట్ల లాభంతో 31,156 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,580 పాయింట్ల వద్దకు క్షీణించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 11 పాయింట్ల లాభంతో 9,618 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దివాళా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు 12 ప్రధాన ఎన్‌పీఏ ఖాతాలపై రిజర్వుబ్యాంక్‌ గుర్తించడంతో పలు బ్యాంకింగ్‌ షేర్లలో కనిష్టస్థాయి వద్ద కొనుగోళ్లు జరిగాయని, దాంతో మార్కెట్‌ ముగింపులో కోలుకున్నదని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. మరో వైపు టోకు ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టస్థాయి 2.17 శాతానికి తగ్గడంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి.

వెలుగులో రిలయన్స్‌...
రిలయన్స్‌ జియో 40 లక్షలమంది కొత్త వినియోగదారుల్ని సంపాదించుకున్నదన్న వార్తలతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 3.30 శాతం ర్యాలీ జరిపి రూ. 1,357 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌–30 షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేరు ఇదే. లార్సన్‌ అండ్‌ టుబ్రో, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 1 శాతంపైగా ఎగిశాయి. సిప్లా, ఐటీసీ, ఏసీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌లు 1–2 శాతం మధ్య క్షీణించాయి.

ప్రభుత్వ రంగ షేర్లపై ఫోకస్‌..: దివాళా చట్టాన్ని ప్రయోగించేందుకు 12 పెద్ద ఎన్‌పీఏ ఖాతాల్ని రిజర్వుబ్యాంక్‌ ఎంపికచేయడంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి నిలిపారు. అధికశాతం ఎన్‌పీఏలతో సతమతమవుతున్న పీఎస్‌యూ బ్యాంకులకు ఆర్‌బీఐ తాజా చర్య ఉపకరిస్తుందన్న అంచనాలతో కొన్ని ఎంపికచేసిన పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. దాంతో అలహాబాద్‌ బ్యాంక్‌ 7.68 శాతం ర్యాలీ జరపగా, ఆంధ్రా బ్యాంక్, సిండికేట్‌ బ్యాంక్‌లు 4 శాతం చొప్పున పెరిగాయి. యూనియన్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు 2 శాతం చొప్పున ఎగిశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు 1–2 శాతం మధ్య పెరిగాయి.

Advertisement
Advertisement