సీఎంసీ నికర లాభం రూ. 58.42 కోట్లు | Sakshi
Sakshi News home page

సీఎంసీ నికర లాభం రూ. 58.42 కోట్లు

Published Thu, Jul 17 2014 1:46 AM

సీఎంసీ నికర లాభం రూ. 58.42 కోట్లు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సర్వీసుల కంపెనీ సీఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ. 53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలం(ఏప్రిల్-జూన్)లో ఆర్జించిన రూ. 53 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఇండియాసహా విదేశీ మార్కెట్లలో అందించిన మెరుగైన సేవలు ఫలితాలలో వృద్ధికి దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది.

 ఇక ఇదే కాలానికి ఆదాయం మరింత అధికంగా 22% పుంజుకుని రూ. 593 కోట్లకు చేరింది. గతంలో రూ. 486 కోట్ల ఆదాయం నమోదైంది.  గత ఆర్థిక సంవత్సరం(2013-14) క్యూ1లో రూ. 94.5 కోట్ల నికర లాభాన్ని సాధించింది. తరుగుదల లెక్కింపు విధానాన్ని మార్చడం,  ఫారెక్స్ నష్టాలు ఇందుకు కారణమైనట్లు కంపెనీ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్.రామన్ చెప్పారు. డాలరుతో మారకంలో రూపాయి బలపడటంతో రూ. 10 కోట్లమేర ఫారెక్స్ నష్టాలు వాటిల్లినట్లు వివరించారు.

 12 మంది కొత్త క్లయింట్లు
 ప్రస్తుత సమీక్షా కాలంలో కొత్తగా 12 మంది క్లయింట్లు లభించగా, నికరంగా 283 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు రామన్ తెలిపారు. సీఎంసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య జూన్ చివరికి 11,932కు చేరింది. ఈ ఏడాది మరో 300 మందిని  నియమించుకోనున్నట్లు రామన్ చెప్పారు. క్యూ1లో 12 డీల్స్ కుదర్చుకోగా, 9 దేశీయంగానూ, మూడు అంతర్జాతీయంగానూ లభించాయని తెలిపారు.   మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూరప్ దేశాలపై దృష్టిసారిస్తున్నట్లు రామన్ తెలిపారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సీఎంసీ షేరు 3% పెరిగి రూ. 1,979 వద్ద ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement