స్పీడుగా సంస్కరణలు.. | Sakshi
Sakshi News home page

స్పీడుగా సంస్కరణలు..

Published Thu, Nov 19 2015 12:18 AM

స్పీడుగా సంస్కరణలు.. - Sakshi

కోల్ ఇండియాలో 10% వాటాల విక్రయం
 ఐపీవోకి కొచ్చిన్ షిప్‌యార్డు
 ఎగుమతిదారులకు 3 శాతం వడ్డీ సబ్సిడీ పథకం..
 కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కీలక నిర్ణయాలు

 
 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చకచకా సంస్కరణల జోరు పెంచుతోంది. ఇటీవలే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుకూలంగా పలు చర్యలు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం, కొచ్చిన్ షిప్‌యార్డు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, నానాటికీ తగ్గుతున్న ఎగుమతులకు ఊతమిచ్చే విధంగా ఎగుమతిదారులకు మూడు శాతం వడ్డీ సబ్సిడీ స్కీమును ప్రకటించింది. జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగం పుంజుకునేలా తగు నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత శాఖకు మరిన్ని అధికారాలు ఇచ్చింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ (సీసీఈఏ) ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది.
 
 కోల్ ఇండియా, కొచ్చిన్ షిప్‌యార్డ్ ..
 దాదాపు రూ. 69,500 కోట్ల బృహత్తర డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించే దిశగా కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం ఉండనుంది. ప్రస్తుతం కోల్ ఇండియా మార్కెట్ విలువ ప్రకారం.. దీని ద్వారా ఖజానాకు కనీసం రూ. 21,138 కోట్లు సమకూరగలవని అంచనా వే స్తున్నట్లు కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. కంపెనీలో ప్రభుత్వానికి 79.65 శాతం వాటాలు ఉన్నాయి. సంస్థలో వాటాల విక్రయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
 
 మరోవైపు, రూ. 10 ముఖవిలువ గల 3,39,84,000 ఈక్విటీ షేర్లతో కొచ్చిన్ షిప్‌యార్డు (సీఎస్‌ఎల్) ఐపీవో ప్రతిపాదనకు క్యాబినెట్ ఓకే చేసింది. ఐపీవో కింద ప్రభుత్వం 1,13,28,000 షేర్లను విక్రయించనుండగా, కొత్తగా 2,26,56,000 షేర్లను జారీ చేయనున్నారు. ముఖవిలువ ప్రకారం వీటి విలువ రూ. 33.98 కోట్లు కానుంది. కొచ్చిన్ పోర్ట్ ట్రస్టు ప్రాంతంలో ప్రతిపాదిత ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, భారీ డ్రై డాక్‌యార్డు నిర్మాణ పనులకు ఐపీవో నిధులు కొంత మేర ఉపయోగపడనున్నాయి.
 
 గ్యాస్ గరిష్ట మార్కెటింగ్ మార్జిన్ తగ్గింపు..
 రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు.. ఎరువులు, ఎల్‌పీజీ ప్లాంట్లకు విక్రయించే గ్యాస్‌పై మార్కెటింగ్ మార్జిన్  కింద గరిష్టంగా రూ. 200 మాత్రమే వసూలు చేయొచ్చని క్యాబినెట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రతి వెయ్యి ఘనపు మీటర్ల గ్యాస్‌కు కంపెనీలు వసూలు చేస్తున్న రూ. 225తో పోలిస్తే ఇది 12.5 శాతం తక్కువ. కొన్ని సంస్థలు డాలర్ మారకంలోనూ చార్జీలు విధిస్తున్నాయి. ఇటీవల కరెన్సీ మారకం విలువలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఇకపై రూపాయి మారకంలోనే మార్కెటింగ్ మార్జిన్‌ను పేర్కొనాలని కేంద్రం తెలిపింది.
 
 ఇన్‌ఫ్రాకూ తోడ్పాటు..
 మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్న కేంద్రం ఈ రంగానికి తోడ్పాటునిచ్చేలా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైవే ప్రాజెక్టుల్లో జాప్యాలు జరిగితే డెవలపర్లకు పరిహారం ఇవ్వడం ఒకటి కాగా.. దాదాపు రూ. 1,000 కోట్ల దాకా సివిల్ నిర్మాణ వ్యయాలయ్యే ప్రాజెక్టులకు అనుమతులిచ్చేలా రహదారి రవాణా శాఖకు అధికారాలు ఇచ్చింది. దీంతో సుమారు 34 కీలకమైన హైవే ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరనుంది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం.. డెవలపర్ పరిధిలో లేని అంశాల కారణంగా ప్రాజెక్టు జాప్యం జరిగిన పక్షంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) తరహా ప్రాజెక్టయితే ఆయా సందర్భాన్ని బట్టి రహదారి శాఖ టోల్ వ్యవధిని పెంచవచ్చు. అలాగే యాన్యుటీ విధానంలోనైతే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. జాప్యం జరిగిన కాలానికి కూడా నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) యాన్యుటీ పరిహారం ఇస్తుంది. చెల్లించాల్సిన యాన్యుటీల సంఖ్య, పరిహారంపై గరిష్ట పరిమితులు ఉంటాయి.
 

Advertisement
Advertisement